చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలట్లో సాగిస్తున్న పర్యటనలు ఏవిధంగా సాగుతున్నాయి. ఇదే తరహా టూర్లు సుమారు ఆరునెలల కిందట జరిగిఉంటే.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. జగన్ ఊర్లలో పర్యటనకు వస్తే దాదాపు అప్రకటి కర్ఫ్యూ వాతావరణం ఉండేదని.. దుకాణాలు మూసివేయడం దగ్గరినుంచి రోడ్ల పక్కన బ్యారికేడ్లు పరదాల వరకు ఎన్నో ఆంక్షలుండేవని.. ఇప్పుడు ఒక ప్రజల్లో కలిసిపోయే ప్రజానాయకుడు వచ్చివెళ్లినట్టుగా ఉంటున్నదని ప్రజలు భావిస్తున్నారు.
ప్రత్యేకించి దీపం 2 పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబునాయుడు పర్యటన, ఆయన వ్యవహరించిన తీరు, ప్రజల్తో ఆయన కలిసిమెలిసి స్పందించిన వైనం ఇవన్నీ కలిసి ప్రజల్లో నాయకుడిగా ఒక భిన్నమైన ఇమేజ్ ను తీసుకువచ్చాయి. చంద్రబాబు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేసిన తర్వాత.. తానే స్వయంగా వారి ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద టీ కాచారు. ఈ టీని మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అందరూ తాగారు.
నాయకులు టీ కాఫీలు కాయడం, దోసెలు పోయడం, షేవింగ్ చేయడం వంటి చిన్నెలు ఎన్నికల ప్రచార సమయంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకసారి గెలిచారంటే.. ఇక అయిదేళ్లపాటూ కనీసం ప్రజల్తో దగ్గరగా కలవడానికి కూడా ఇష్టపడరు. ప్రజలతో ఆత్మీయంగా మెలగడం అనేది ఉండదు గాక ఉండదు. కానీ చంద్రబాబునాయుడు- పేదవాడి ఇంటికి వచ్చిన ఒక సింపుల్ అతిథిలాగా వారి ఇంట్లో తానే టీ కాచి అందరికీ ఇవ్వడం గొప్ప విషయం. ఇలాంటి సందర్భాల్లోనే జగన్ పాలన ఎలా ఉండేదో జనం గుర్తు చేసుకుంటున్నారు.
జగన్ జిల్లాలకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటే.. ఆ తరహానే వేరుగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఒక ఊరికి వస్తున్నారంటే.. ముందుగా స్పెషల్ పోలీసులు వస్తారు. ఏ సీఎం వచ్చినా ఇంతే కదా అని అనుకోవచ్చు. కానీ.. జగన్ పాలనకాలంలో.. ఆయన రోడ్డు మార్గంలో సభావేదిక దాకా వెళ్లేలా ప్రోగ్రాం ఉంటే ప్రజల జీవితం కష్టాలమయమే. ఆ రోడ్డుకు రెండు వైపులా ఉండే దుకాణాలను మూయించేస్తారు. ఆ రోడ్డుకు రెండు వైపులా ఉండే చెట్లను నరికించేస్తారు. రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటుచేసి పరదాలు కూడా కట్టేస్తారు. అందుకే జగన్ పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.
అన్నింటికంటె ముఖ్యమేంటంటే.. లబ్ధిదారులు సభకు రావాల్సిందే తప్ప.. జగన్ ఇళ్లకు వెళ్లరు. (కేవలం, ఓడిపోయిన తర్వాత చావు ఇళ్లల్లో పరామర్శకు మాత్రమే వెళుతున్నారు). చంద్రబాబునాయుడు అలా కాదు. పథకాల్ని వారి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లు ఇవ్వడం నుంచి ఇలాగే చేస్తున్నారు. అందుకే ఈ పాలనలో చంద్రబాబునాయుడు పర్యటనలకు, జగన్ పర్యటనలకు ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారు!!