నామినేటెడ్ పదవుల పందేరానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారని, పదిరోజుల్లోగానే.. ముఖ్యమైన అన్ని పదవులకు ఎంపికచేసిన వారిని ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆశావహులకు ఇది శుభవార్త అని చెప్పాలి. రేసులో ఉన్నవారు గంపెడాశలతో తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవాలి. అయితే.. ఇప్పుడు వాతావరణం మాత్రం అలా లేదు. ఈ నెలలో కాకుండా.. ఆగస్టు గడచిన తర్వాత నామినేటెడ్ పదవుల పంపకం పెట్టుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీకి- ఆగస్టు నెలకు ఒక లంకె ఉంది. పార్టీలో పుట్టిన కొన్ని సంక్షోభాలు ఆగస్టు నెలలోనే పుట్టాయి. అదే చాలా మంది శ్రేణుల్లోని భయం. ఆగస్టు సంక్షోభం అనేది ఆ పార్టీని ఎన్నడూ వెన్నాడుతూనే ఉంటుంది. అందుకే పార్టీ నాయకులు ఇప్పుడు కొత్త ఆలోచనను తమ అధినేత దృష్టికి తీసుకువెళుతున్నారు. నామినేటెడ్ పదవుల పందేరం అనేది ఈ నెలలో వద్దేవద్దని అంటున్నారు.
మామూలు పరిస్థితుల్లోనే ఆగస్టు నెలలో పార్టీ కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటుంది. అలాంటి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.
ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటై ఉంది. ఆ రెండు పార్టీలకు కూడా నామినేటెడ్ పోస్టుల్ని పంచవలసిన బాధ్యత ఉంది. వారిలో కూడా అసంతృప్తి రేగే చాన్సుంది. అయితే.. కూటమిలోని ఆ రెండు పార్టీలు ఎంత అసంతృప్తికి గురైనా చేయగలిగింది ఏమీ లేదు. వారిద్దరూ లేకుండా కూడా ప్రభుత్వానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ తెలుగుదేశానికి ఉంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఈ నెలలో పదవుల పందేరం వద్దని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే స్థానాలు పంచినట్లుగా, మంత్రి పదవులు పంచినట్లుగా నామినేటెడ్ పదవులు పంచినా కూడా.. ఎవ్వరిలోనూ ఎలాంటి అసంతృప్తి రేగని విధంగా చేయాలని అలా చేయాలంటే.. ఆచితూచి వ్యవహరించాలని.. తొందరపాటు లేకుండా అందరినీ సమాధాన పరచిన తర్వాత ప్రకటిస్తే బాగుంటుందని కూడా అంటున్నారు.