జగన్మోహన్ రెడ్డి రాజ్యం చేసినంత కాలం.. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ.. ఆయన స్కెచ్ లకు రంగులు పులుముతూ, ఆయన ట్యూన్లకు నృత్యం చేస్తూ.. ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం.. రాజకీయ ప్రత్యర్థుల మీదికి అడ్డగోలుగా విరుచుకుపడిన ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసులకు ఇప్పుడు గుండెలు దడదడలాడుతున్నాయి. చంద్రబాబునాయుడును అక్రమ కేసులతో అరాచకమైన రీతిలో అరెస్టు చేసిన పర్వానికి సంబంధించిన అధికారులు, ఆ తర్వాత ఆయనను మరింత ఇబ్బంది పెట్టేలా దర్యాప్తు సాగించిన అధికారులు.. ఇప్పడు సింహాసనం మీదికి రాగానే ఆయన ఎదుట సాగిలపడడానికి సిద్ధపడుతున్నారు గానీ.. చంద్రబాబు మాత్రం సహించే స్థితిలో లేరని తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కనీసం చంద్రబాబు ఇంటివద్ద మెయిన్ గేటు దాటి లోపలకు వెళ్లగలిగారు. కానీ.. అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు కలవరని భద్రతాసిబ్బంది చెప్పడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. సీఐడీ చీఫ్ సంజయ్ ను అసలు మెయిన్ గేటు వద్దనే ఆపేసి తిప్పి పంపారు. చంద్రబాబు మీద బనాయించిన కేసులను విచారించడానికి ఏర్పాటైన సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా అనుమతి రాలేదు. చంద్రబాబు ఆయనకు సంబంధించిన వారిమీద అక్రమకేసులు బనాయించి, జగన్ భక్తితో రాజకీయ వేధింపులకు పాల్పడిన అధికారులుగా వీరందరూ కూడా ముద్రపడ్డారు. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత.. ప్రసన్నం చేసుకోవడానికి, అవసరమైతే.. ఏదో అధికారంలో ఉన్నందువల్ల ఒత్తిడితో అలా చేశాం తప్ప తమమీద ఆగ్రహించవద్దని నచ్చజెప్పుకోవడానికి వారు చంద్రబాబు ఎదుట సాగిలపడడానికి సిద్ధపడారు గానీ.. ఆయన మాత్రం సహించేది లేదని తేల్చేశారు.
కేవలం ఈ ఐపీఎస్ అధికారులు మాత్రమే కాదు.. జగన్ భక్తులుగా ముద్రపడిన ఐఏఎస్ అధికారులకు కూడా చంద్రబాబు నివాసంలోకి ఎంట్రీ లభించలేదు. వీరు మాత్రమే కాదు.. నిన్నటిదాకా జగన్ కోటరీలో అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేశారు. వారికి ఇంకా పోస్టింగు కూడా ఇవ్వలేదు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సీఎంఓ లోని పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా లను బదిలీచేశారు.
సివిల్ సర్వీసెస్ అధికారుల్లో జగన్ భక్తితో ఇన్నాళ్లు చెలరేగిపోయిన వారిని తప్పించి.. స్వచ్ఛంగా ఉండేవారిని కీలక బాధ్యతల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రస్తుతం ఫోకస్ పెడుతున్నారు. జగన్ భక్తులను ఏం చేస్తారనేది ఆ తర్వాత తేలుతుంది.
సాగిలపడినా సరే.. సహించేది లేదు!
Tuesday, December 24, 2024