ఒక రాజకీయ పార్టీకి అధినేత అన్న తరువాత.. వారు ఎక్కడ ఉన్నా సరే.. వారి చుట్టూ అభిమానులు, కార్యకర్తలు మూగుతూ ఉంటారు. ప్రత్యేకించి విదేశాలకు, విహార యాత్రలకు వెళ్లిన సందర్భాల్లో తప్ప వారికి ప్రైవసీ పెద్దగా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి గిట్టవనే సంగతి అందరికీ తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉండగా కూడా.. కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చే అలవాటు జగన్ కు లేదు. అలాంటిది ఓడిపోయిన తర్వాత.. ఇక అంతా ఖాళీనే గనుక.. జగన్ ను కలవొచ్చునని, కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకులైనా ఆశించడంలో తప్పులేదు. అలాంటివి కూడా వారికి సాధ్యం కావడం లేదు. ప్రత్యేకించి.. జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు యలహంకలోని తన ప్యాలెస్ కు వెళ్లినప్పుడు.. అసలు పార్టీ నాయకులు ఎవ్వరినీ ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత.. ఇప్పటికి అయిదారుసార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లారు. ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే బెంగుళూరులోని ప్యాలెస్ ను నివాసయోగ్యంగా చిన్న చిన్న మరమ్మతులతో హంగు ఆర్భాటాలతో సిద్ధం చేయించుకున్న జగన్.. ఎక్కువ సమయం అక్కడ గడపడానికే ఇష్టపడుతున్నారు. అయితే బెంగుళూరులో ఉండగా.. పార్టీ నాయకులు ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ దొరడకం లేదని తెలుస్తోంది.
తాడేపల్లిలో ఉంటేనే బెటర్.. ఒక స్థాయి గల నాయకులు వచ్చేస్తే అప్పటికప్పుడు జగన్ కు సమాచారం ఇచ్చి కలవడానికైనా వీలుండేది. బెంగుళూరులో ఉండగా.. నాయకులు ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కూడా ఫలితం ఉండడం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. యాదృచ్ఛికంగా అదే సమయంలో బెంగుళూరులో ఉన్న ఇతర నాయకులు లేదా, యలహంక ప్యాలెస్ లో అయితే జగన్ కాస్త సావధానంగా మాట్లాడగల స్థితిలో ఉంటారని ఆశపడుతున్న వాళ్లు బెంగుళూరు వెళ్లి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా దొరకడం లేదని అంటున్నారు.
మంత్రి స్థాయిలో జగన్ కేబినెట్లో పనిచేసిన ఒక నాయకుడు ఇటీవల బెంగుళూరు వెళ్లి జగన్ ను కలవాలని అనుకుంటే పర్మిషన్ రాలేదని తెలుస్తోంది. వైసీపీ నాయకులు అనే ఎవ్వరికీ కూడా యలహంక ప్యాలెస్ లోకి నో ఎంట్రీ బోర్డు తప్ప మరోటి లేదని అంటున్నారు. జగన్ ఈ సమయంలో పార్టీ పునర్నిర్మాణానికి అందరి సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత చూడకుండా.. ఇలా కనీసం నాయకుల్ని కూడా కలవకుండా.. ఉంటే పార్టీ ఎలా తిరిగి గాడిన పడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యలహంక ప్యాలెస్ లో తమ్ముళ్లకు నో ఎంట్రీ!
Tuesday, November 12, 2024