కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత.. పాత ప్రభుత్వం పాల్పడిన అవినీతి కార్యకలాపాలను తవ్వి తీస్తుంటే.. పాపాల పుట్ట పగిలినట్లుగా.. పెద్దిరెడ్డి కుటుంబ బాగోతాలే వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మంత్రులు అవినీతికి పాల్పడితే వారి వారి శాఖల్లో దందాలు వెలుగు చూస్తాయి. కానీ జగన్ సర్కారు హయాంలో ఏ భారీ కుంభకోణం బయటకు వచ్చినా దాని వెనుక ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో పెదిరెడ్డి కుటుంబ ప్రమేయం ఉంటోంది. తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లను అవినీతి అనకొండలుగా ప్రజలు చూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కమల తీర్థం పుచ్చుకోవడం ద్వారా.. తమ అవినీతి మీద విచారణలు జరగకుండా రక్షణ పొందాలని అనుకున్న ఈ తండ్రీకొడుకులు ప్రయత్నాలు బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది.
పెద్దిరెడ్డి ఫ్యామిలీ.. వైసిపికి దక్కిన తాజా పరాజయం తరువాత బీజేపీలో చేరదలచుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎంపీగా మిథున్ రెడ్డి తనకు డిల్లీ పెద్దలతోఉన్న సంబంధ బాంధవ్యాలను వాడుకుని పార్టీ మారే ప్రయత్నాలు చేసినట్టుగా అప్పట్లో వినిపించింది. తాజాగా.. వైసిపి వారిని బిజెపిలోకి ఆహ్వానిస్తున్నట్టు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించిన నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబ చేరిక అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది. అయితే.. పెద్దిరెడ్డి కుటుంబ అవినీతి బాగతాలపై వివరాలు తెప్పించుకున్న కమలం పెద్దలు పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. అలాగే.. కూటమి ప్రభుత్వం కేసులు పెడితే సాయం చేయలేం అని కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
అధికార కూటమిని డిల్లీ పెద్దలు ప్రభావితం చేయగలరు గనుక.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ వారిని ఆశ్రయించారు గానీ ఫలితం దక్కలేదు. పెద్దిరెడ్డి కొంతకాలంగా వైసిపి వ్యవహారాలతో కూడా ఆంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వేరే గత్యంతరం లేక మాత్రమే జగన్ పార్టీలో కొనసాగుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.