ఆలస్యానికి నో చాన్స్ : మెట్రో పనులు షురూ!

Friday, December 5, 2025

ఈ అయిదేళ్ల పదవీకాలంలో అభివృద్ధి పరంగా రాష్ట్రం రూపురేఖలను మార్చేయాలనే ఉద్దేశంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా, ముందుచూపుతో అడుగులు వేస్తున్నదో అర్థం చేసుకోవడానికి మెట్రో పనులు ఒక ఉదాహరణ. విజయవాడలోను, విశాఖలోను తొలిదశ మెట్రో పనులు చేపట్టడానికి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలుస్తోంది. ప్రజలకు హామీ ఇచ్చిన ప్రధానమైన అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో ఎలాంటి జాప్యానికి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ తొలిదశ మెట్రో పనులకు టెండర్లు పిలుస్తుండడం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. సవరించిన అంచనాల ప్రకారం విశాఖలో 11,498 కోట్ల రూపాయలతోను, విజయవాడలో 10,118 కోట్లరూపాయలతోను మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టనున్నారు. మామూలుగా అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో యాభై శాతం వంతున నిధులు సమకూర్చాలి. మొత్తం వంద శాతం నిధులను కేంద్రప్రభుత్వమే సమకూర్చేలా అనుమతించాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. కూటమి ఎంపీలు కూడా ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి.. ఈమేరకు వందశాతం నిధులకోసం విజ్ఞప్తి చేశారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టుపై ఇంకా కేంద్రంనుంచి అనుమతులు రాలేదు.

అయినాసరే.. పనులు వెంటనే ప్రారంభించేయాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్రం ఆమోదం లభించేలోగా రాష్ట్ర వాటా నిధులతో చేపట్టే పనులను ప్రారంభించేయడానికి ఇవాళ టెండర్లు పిలుస్తున్నారు. ఒకవేళ కేంద్రం నూరుశాతం నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నా.. ఇప్పుడు పెట్టబోతున్న ఖర్చును ఆ తర్వాత కేంద్రంనుంచి పుచ్చుకుంటారు. అందుకు తిరస్కరించినా.. ఎటూ రాష్ట్ర వాటా డబ్బులు పెట్టాల్సిందే కాబట్టి.. ఇప్పుడే వాటిని ప్రారంభిస్తున్నారు. ఈ రెండు నగరాల్లో తొలిదశ మెట్రో ప్రాజెక్టు కింద పనులు చేపట్టడానికి శుక్రవారం టెండర్లు పిలుస్తున్నారు.
ఈ అయిదేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన పురోగతిని చూపించాలనే కృతనిశ్చయమే ప్రభుత్వంతో ఈ పనిచేయిస్తున్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. కేంద్రం డీపీఆర్ లను ఆమోదించేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. వారు పూర్తిగా ఆమోదం తెలియజేసి నిధులు విడుదల చేసేదాకా ఆగితే.. ఆ తర్వాత టెండర్లు పిలవడం ప్రారంభిస్తే… మిగిలిన నాలుగేళ్ల పదవీకాలం పూర్తయ్యేలోగా మెట్రో పనులు ప్రారంభ దశలోనే ఉంటాయి. అలాంటి  జాప్యానికి ఆస్కారం లేకుండా.. రాష్ట్రప్రభుత్వం యాభై శాతం నిధులు భరించాల్సిందే కాబట్టి.. ఆ ప్రతిపాదనకు ఆల్రెడీ కేంద్రం ఆమోదం ఉన్నది కాబట్టి.. తమ వాటా నిధులతో పూర్తికాగల పనులను తక్షణం ప్రారంభించేస్తే.. కేంద్రంనిధులువచ్చేలోగా ఒక దశ వరకు పూర్తయి ఉంటాయని.. వేగిరంగా మెట్రోలను పూర్తిచేసి.. ఎన్నికల్లోగానే ప్రజలకు కానుకగా అందించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles