కొత్త పుకారు: గేలం పాతదే.. చేప కూడా పాతదే!

Wednesday, January 22, 2025

తెలంగాణ రాజకీయాలలో ఒక పాత వ్యవహారానికి సంబంధించి కొత్త పుకారు ఇప్పుడు వైరల్ అవుతున్నది. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులలో ఒకడైన తన్నీరు హరీష్ రావు మామయ్య స్థాపించిన పార్టీని విడిచి భారతీయ జనతా పార్టీలో చేరుతారా అనే సందేహంతో జరుగుతున్న ప్రచారం ఇది. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటల పుణ్యమాని.. హరీష్ రావు బిజెపిలో చేరుతారేమో అనే ప్రచారం ఊపందుకుంది.

నిజానికి హరీష్ రావు భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఇవాళ్టిది కాదు. కొన్ని సంవత్సరాల కిందటే మొదలైంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ఈటల రాజేందర్ బిజెపిలో చేరడానికంటె ముందునుంచి ఆ ప్రచారం ఉంది. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అల్లుడు హరీష్ రావును లూప్ లైన్లో పెడుతూ.. కొడుకు కేటీఆర్ ను మాత్రం ప్రోత్సహిస్తుండిన వాతావరణం ఉంది. ఇప్పటికీ ఆ వాతావరణంలో మాత్రం మార్పు లేదు.

కానీ.. అప్పట్లో ఈ వైఖరి పట్ల హరీష్ కినుక వహించారని.. ఆయన పార్టీ మారి బిజెపిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని.. ఆయన వెంట భారాస శ్రేణులు కూడా చాలా వరకు వెళ్లవచ్చునని ప్రచారం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్, హరీష్ రావును చాలా గొప్ప నాయకుడిగా, పోరాటాల నుంచి పుట్టిన నాయకుడిగా అభివర్ణిస్తూ, ఆయన తమ పార్టీలో చేరడానికి వచ్చినా సరే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్లీ గెలవాల్సి ఉంటుందని అన్నారు.

హరీష్ రావు అప్పుడూ ఇప్పుడూ కూడా.. గులాబీ అధినాయత్వం పట్ల కినుకగానే ఉన్నారా? అవకాశం వస్తే ఆ పార్టీని వీడడానికి సిద్ధంగానే ఉన్నారా? అనేది ఇప్పుడు తాజాగా మళ్లీ మొదలైన చర్చ. మొత్తానికి బండి సంజయ్.. ఇలాంటి ప్రచారానికి తాజాగా శ్రీకారం చుట్టారు. అందుకే ప్రజలు.. తమ పార్టీలో హరీష్ ను చేర్చుకోవడానికి బిజెపి వాడుతున్న గేలం పాతదేనని, దానికి తోడు చేప కూడా పాతదేనని.. సరికొత్తగా మళ్లీ ప్రయత్నం జరుగుతున్నదని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles