అమరావతి ప్రియులకు ఇది మరొక శుభవార్త! ఏపీ రాజధాని నగరాన్ని దేశంలోని అటు ఉత్తర, ఇటు దక్షిణ భారత ప్రాంతాలతో అనుసంధానం చేసే కీలకమైన రైల్వేలైను పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు వేగం పుంజుకోవడానికి ఈ రైల్వే లైన్ మంజూరు అనేది ఒక కీలక కారణం కానున్నది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చురుగ్గా మొదలవుతున్న నేపథ్యంలో రైల్వేలైను పనులు కూడా వెంటనే మొదలైతే కనుక.. యావత్ అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణాలు జోరందుకోవడం తథ్యం అని అందరూ భావిస్తున్నారు. అమరావతిని మిగిలిన దేశంతో అనుసంధానించడానికి ఏర్పాటు చేస్తున్న 57 కిలోమీటర్ల నూతన రైల్వేలైను ఏర్పాటు పనులను పూర్తి చేయడానికి కేంద్రం గడువు కూడా విధించడం ఒక గొప్ప శుభ పరిణామం. అటు ఇటుగా కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ ప్రభుత్వ కాలం పూర్ణయ్యేలోగా రైల్వేలైను పనులు కూడా ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
2245 కోట్ల రూపాయల అంచనావ్యయంతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను పనులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. హైదరాబాద్, కలకత్తా, చెన్నై, సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఏపీలో ఈ కొత్త రైల్వే లైను ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఏర్పాటు కానుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి ,అమర లింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి అనుకూలంగా అభివృద్ధి అవుతుంది. అటు ఎగువన మచిలీపట్నం, కాకినాడ దిగువన కృష్ణపట్నం పోర్టులను కూడా అనుసంధానం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పాటు బీహార్ కు కూడా ఒక కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ను కేంద్రం మంజూరు చేసింది. ఈ రెండు ప్రాజెక్టులను నాలుగేళ్ల గడువులోగా పూర్తి చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వేలైను ఏర్పాటు కావడం అనేది అమరావతి నగర నిర్మాణ పనులు మరింత వేగంగా జరగడానికి అవసరమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని పలువురు భావిస్తున్నారు.
అమరావతికి కొత్త రైల్వే లైన్: నాలుగేళ్లలోనే పూర్తి!
Wednesday, January 22, 2025