ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం చంద్రబాబు నాయుడుకి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఓ లేఖను రాశారు. ఏపీ మాజీ ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే తన పరిశీలనలు, సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నాయకులు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టం అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టలని ఆయన సీఎంకి యనమల సూచించారు.
జగన్ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని యనమల పేర్కొన్నారు. రాష్ట్రానికి మాజీ ఆర్థిక మంత్రిగా తన అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తోడ్పాటుతో పాటు, రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని యనమల అభిప్రాయపడ్డారు.
పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం, సహేతుకమైన స్థిరమైన రుణాలు, ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని తెలిపారు. ఈరోజు నాటికి ఏపీకి కేంద్ర రుణాల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాలని సిఫార్సు చేశారు. అలాగే వెయిన్స్ అండ్ మీన్స్, ఓడిని జాగ్రత్తగా ఉపయోగించాలని వివరించారు.
అలాగే ఆదాయ వ్యయాలను తగ్గించుకోవాలని, సంక్షేమ పథకాలను అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేవిధంగా, అందజేసే విధంగా ప్రభుత్వాధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలని యనమల లేఖలో తెలిపారు. మూలధన వ్యయం పక్కదారి పట్టకుండా అరికట్టాలని, ఏపీ అంటే పారిశ్రామిక గమ్యస్థానం అనేట్లుగా మార్చాలని యనమల సూచించారు.
సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని కోరారు. వైసీపీ నాయకులు మింగేసిన డబ్బు, రెవెన్యూ రికవరీ చట్టం అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని లేఖలో యనమల కోరారు.