ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ రెండు రోజుల ముందే సూచించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి.. జూన్ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. కెరీర్ చివరి రోజుల్లో ఆయన ఒక జీవితానికి సరిపడా అపకీర్తిని మూటగట్టుకుని పోయారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
సీనియర్ అధికారి జవహర్ రెడ్డికి ఐఏఎస్ వర్గాల్లో చాలా మంచి పేరు ఉంది. నిజాయితీగల అధికారిగా కూడా ఆయనను అందరూ ప్రశంసిస్తుంటారు. గతంలో ఆయన అనేక సందర్భాల్లో పేదల పక్షపాతిగా పనిచేశారని కూడా పలువురు అంటుంటారు. కెరీర్ ఆద్యంతమూ ఎంతో నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినప్పటికీ.. జవహర్ రెడ్డి దురదృష్టం ఏంటంటే.. ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి తీసుకుని సకల అపభ్రంశపు నిర్ణయాలన్నీ తన చేతుల మీదుగా ఆయన చేయాల్సి వచ్చింది. జగన్ భక్తిని ప్రదర్శించడం ప్రారంభించిన తర్వాత.. అంత సీనియర్ గా ఉండి కూడా ఆయన దిగజారుడు మొదలైంది.
జగన్ ప్రభుత్వం పరిపాలన సాగినంత కాలమూ.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. అనేక నిర్ణయాల విషయంలో కోర్టు మొట్టికాయలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇలాంటి వాటన్నింటికీ జవహర్ రెడ్డి ప్రధాన బాధ్యుడు అయ్యారు. ప్రత్యేకించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఆయనలో జగన్ పట్ల వీరవిధేయత మరింత పెల్లుబికింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారో లెక్కేలేదు. జగన్ కు భజనచేసే ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం పక్కకు తప్పించినప్పుడు.. ఆ స్థానంలో మరొకరిని నియమించేందుకు 3 పేర్లతో ప్యానెల్ పంపాల్సిన ప్రతిసారీ జవహర్ చుట్టూ కొత్త వివాదాలు ముసురుకున్నాయి. ఒక జగన్ భక్తుడిని పక్కకు తప్పిస్తే.. ముగ్గురు జగన్ భక్తుల పేర్లను సిఫారసు చేస్తున్నారంటూ ఆయన మీద ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రత్యేకించి పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి వీల్లేదని ఈసీ ఆదేశించిన తర్వాత.. సచివాలయాల వద్దకు పిలిపించి ఇవ్వడం, వృద్ధుల ఖాతాల్లో వేయడం ద్వారా ముసలివాళ్లను బాగా ఇబ్బంది పెట్టారనే విమర్శలు కూడా ఆయన చుట్టూ వచ్చాయి.
మొత్తానికి జగన్ పట్ల వీరభక్తితో తీసుకున్న నిర్ణయాలు అన్నీ కలిసి ఆయన సుదీర్ఘమైన కెరీర్ లో ఉన్న మంచి పేరు మొత్తం మసిబారిపోయేలా చేశాయి. పుష్కలమైన అపకీర్తితో ఆయన ఈ నెలాఖరున పదవీవిరమణ చేయబోతున్నారు.
కొత్త సీఎస్ రెడీ: మరకలతో ముగిసిన జవహర్ చరిత్ర!
Saturday, December 21, 2024