ఇవేమీ వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆరోపణలు కాదు. ట్రైబల్ మహిళ అని చూడకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ అర్థంపర్థం లేని లాజిక్ లు తీసి తప్పించుకోవడానికి అవకాశం లేదు. వ్యక్తిత్వ హననం చేసే ఆరోపణలు కూడా కాదు. ఇవి పూర్తిగా అవినీతికి, దందాలకు సంబంధించిన ఆరోపణలు. కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సంజాయిషీ ఇవ్వవలసిందే. కోట్లాది రూపాయల భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి- దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో విధులు నిర్వహించిన శాంతి అనే మహిళకు ముడిపెట్టి ఇటీవల అనుచితమైన ఆరోపణలు వైరల్ అయ్యాయి. స్వయంగా ఆమె భర్త ఈ ఆరోపణలు చేసినందువల్ల.. ఎక్కువ మంది నమ్మారు. వాటిపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ జమిలిగా అవినీతి వ్యవహారాలలో కూడా ప్రమేయం ఉన్నట్లుగా జనసేన విశాఖపట్నం కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. విశాఖలో విజయసాయి రెడ్డికి, దేవాదాయ శాఖ అధికారి శాంతి బినామీగా వ్యవహరించాలని, దసపల్ల, ప్రేమ సమాజం భూముల స్వాహా చేయడంలో ఆమె సహకరించారని ఈ భాగోతాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పీతల మూర్తి యాదవ్ కోరుతున్నారు.
నిన్నటి వరకు అనుచిత ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి చాలా తీవ్ర స్వరంతో ఆ ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు అలాంటివి కాదు. అచ్చంగా భూముల కబ్జాకు, స్వాహా పర్వానికి సంబంధించినవి. విజయసాయిరెడ్డికి అంతే చిత్తశుద్ధి ఉంటే పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నట్లుగా సిట్టింగ్ జడ్జి విచారణకు తాను సిద్ధమేనని ప్రకటించాలి. అధికారి శాంతికి- ఉద్యోగంలో చేరిన రెండేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఆస్తుల కొనుగోలు ఎలా సాధ్యమైందో కూడా విచారణ జరగాలి. కనీసం ఇలాంటి అవినీతి ఆరోపణల మీద విచారణకు విజయసాయిరెడ్డి, శాంతి ఇద్దరు పూర్తిగా సహకరిస్తే గనుక వారి మీద వెల్లువెత్తిన అనుచిత ఆరోపణల విషయంలో వారి వాదన నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. లేకపోతే అన్ని విషయాలలోనూ ఒకే రీతిగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది.