ఏపీ మాటెత్తకుండా జాతీయ రాజకీయం ఎలా?

Sunday, December 22, 2024

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం ఆశలావు పీకసన్నం అనే సామెత చందంగా ఉంది. ఆయనకు అర్జంటుగా ఎర్రకోటపై గులాబీ జెండాను రెపరెపలాడించాలని కోరిక. తక్షణం తాను ప్రధానమంత్రి అయిపోవాలని, ఈ దేశానికి కొత్త దశ దిశ నిర్దేశించాలని, ఇన్నాళ్లు చేతగాని పరిపాలన జరిగింది.. ఇప్పుడు అసలు పరిపాలన అంటే ఏంటో యావత్ దేశానికి రుచిచూపించాలని ఆరాటం. అందుకే భారత రాష్ట్ర సమితి గా తన పార్టీకి పేరుమార్చి కొత్త పోరాటం ప్రారంభించారు. 

ఇల్లలకగానే పండగ అవుతుందా అన్నట్టుగా పేరు మార్చి, జాతీయ పార్టీ గుర్తింపు తెచ్చుకోగానే దేశంలో అధికారం దక్కుతుందా? అనేది ఇక్కడ ప్రజల ప్రశ్న. భారాస విస్తృతి ఎంత? ఏ రకంగా ఆయన ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లగలనని అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. రాజకీయచతురుడు అయిన కేసీఆర్ వద్ద.. ఇందుకు సంబంధించిన వ్యూహాలు ఉండవచ్చు కానీ.. ఇప్పటిదాకా ఆ వ్యూహాలతో ఆయన ప్రజల్లో మాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. 

ఎందుకంటే.. ఇంటగెలిచి రచ్చగెలవాలనేది సామెత. కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన జాతీయ పార్టీ స్థాపించినప్పటికీ.. ముందు తెలుగురాష్ట్రాల్లో దాని ప్రభావం ఏమిటో, ప్రజాదరణ ఏమిటో నిరూపించుకోవాలి. అయితే జాతీయ పార్టీ గురించి చాలా కాలంగా మాటలు చెబుతున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో దానిని ఎలా ముందుకు తీసుకువెళతారో ఆయన ఇప్పటిదాకా ముడి విప్పలేదు. ప్రత్యేకించి పొరుగున ఉన్న ఏపీలో భారాస సంగతేంటో ఆయన చెప్పాలి. ఏపీలో కూడా తమ పార్టీ పోటీచేస్తుందని పార్టీ నాయకులు చెప్పడం కాదు. ఏపీలో వ్యూహం ఏంటో కేసీఆర్ చెప్పాలి. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో లేని కుమారస్వామి సానుకూలంగా కనిపిస్తున్నారు కదాని.. కర్ణాటక ఎన్నికల్లో పోటీచేయడంతోనే భారాస ప్రస్థానం ప్రారంభం అవుతుందని కేసీఆర్ అంటున్నారు. అక్కడ కూడా జేడీఎస్ కు మద్దతు ఇస్తాం అంటున్నారు. కుమారస్వామిని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం అంటున్నారు. మరి ఆ తర్వాత వచ్చే ఏపీ ఎన్నికల సంగతేమిటి? నిజానికి ఏపీలో ఎన్నికలు వచ్చే సమయానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయి ఉంటాయి. ఏపీలో బరిలోకి దిగి.. తాను దేశ రాజకీయాల దశ మారుస్తానని ప్రజలను నమ్మించే చేవ కేసీఆర్ కు ఉన్నదా? అధికార దాహంతో కుట్రపూరితంగా రాష్ట్రాన్ని చీల్చి, ఏపీని అనాధలా మార్చి చెలరేగుతున్నారని ఏపీ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఆయన వారిలో ఎలాంటి నమ్మకాన్ని కలగిస్తారు. కనీసం పొరుగున ఉన్న రాష్ట్రంలో కూడా తన పార్టీ ప్రాబల్యం చూపించలేకపోతే గనుక.. దేశమంతా నెగ్గి ఎర్రకోట మీద గులాబీ జెండా రెపరెపలాడిస్తానని ఎలా ప్రగల్భాలు పలుకుతారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. 

ఏపీలో జగన్మోహన్ రెడ్డితో భారాసకు లోపాయికారీ ఒప్పందం ఉంటుందా? అనే ప్రచారం కూడా ఉంది. బిజెపితో కూడా రాజకీయాలకు అతీతమైన బంధం కొనసాగించే జగన్ అదే తరహాలో బిఆర్ఎస్ తో కూడా రాజకీయాలకు అతీతమైన బంధాన్ని కలిగిఉంటారని, కేసీఆర్ జగన్ కు వీసమెత్తు నష్టం జరగకుండా.. తన జాతీయ రాజకీయాలను డిజైన్ చేసుకుంటారని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles