రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు సాగిస్తున్న పోరాటం అంతా టిడిపి పోరాటం అంటూ ఒకవంక అధికార వైసిపి నేతలు ఆరోపణలు చేస్తుంటే, ప్రస్తుతం అమరావతి రైతులు జరుపుతున్న అమరావతి నుంచి అరసవెల్లికి మహాపాదయాత్రను తిరిగి కొనసాగించడం పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
పాదయాత్రకు వ్యతిరేకంగా అధికార వైసిపి ఉత్తరాంధ్రలో నిరసనలు, ఆందోళనలు చేస్తుండడంతో మొత్తం ప్రజల దృష్టి అటువైపు మరలుతుందని, దానితో జనవరి 27 నుండి తాను చేబట్టబోయే పాదయాత్ర ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉన్నదని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అందుకనే, స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని, పాదయాత్రను ఇంతటితో ఆపివేయమని అమరావతి రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే అందుకు రైతులు విముఖత వ్యక్తం చేయడమే కాకుండా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో పాదయాత్ర ఎక్కడి ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభమవుతందని ప్రకటించారు.
నవంబర్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు ఆగిన చోట నుండే పాదయాత్ర పునః ప్రారంభం అవుతుందని అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగడానికి వ్యతిరేకంగా ఉన్నారని, విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా కావాలని కోరుతున్నారని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతుల పాదయాత్ర జరిగితే వైసిపి శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని చంద్రబాబు నాయుడు వారించినట్లు తెలిసింది. గతంలో తిరుపతి వరకు పాదయాత్ర జరిపినప్పుడు ఆయా జిల్లాల ప్రజలలో ఎక్కడా నిరసనలు ఎదురు కాలేదని, కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితులు వేరని వాదిస్తున్నారు.
అయితే ఉత్తరాంధ్రలో కూడా దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు సహితం అమరావతికి మద్దతుగా ఉన్నారనే సందేశం వ్యక్తం చేయాలనీ అమరావతి రైతులు పట్టుదలగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ వాదనలు మరో రకంగా ఉన్నాయి. మొన్నటి వరకు `మూడు రాజధానులు’ అంశంపై మౌనంగా ఉంటూ వచ్చిన వైసిపి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర వైపుకు వచ్చే సరికి వీధులలోకి వచ్చి హడావుడి చేయడం ప్రారంభించిందని గుర్తు చేస్తున్నారు.
మూడు రాజధానుల గురించి వైసిపి విస్తృతంగా హడావుడి చేస్తే లోకేష్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కొంత ప్రభావం చూపడమే కాకుండా, అమరావతి రైతుల ఉద్యమం కుదించును పోతుందని కొందరు టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే, మధ్యలో పాదయాత్రను ఆపివేస్తే `వెన్ను చూపిన్నట్లు’ కాగలదని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకనే ఏది, ఏమైనా పాదయాత్ర అనుకున్న విధంగా జరగవలసిందే అని భీష్మించుకు కూర్చున్నారు.
అయితే టిడిపి అధినేతలను కాదని పాదయాత్రను కొనసాగిస్తే పాదయాత్ర తిరిగి గ్రామాలలో స్థానిక టిడిపి శ్రేణుల నుండి గతంలో వలే మద్దతు లభిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. పాదయాత్రకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడంలో ఇప్పటి వరకు సహకరిస్తూ వచ్చిన టిడిపి శ్రేణులు మౌనంగా ఉంటె కొంతమేరకు ఇబ్బందికరం కాగలదని భావిస్తున్నారు.
బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహితం ఈ విషయమై అమరావతి జేఏసీ నేతలను పిలిపించి చర్చించినట్లు తెలిసింది. టీడీపీ నాయకత్వం ఈ పాదయాత్ర కొనసాగింపు పట్ల విముఖంగా ఉన్నప్పటికీ, బీజేపీ, జనసేన, వామపక్షాల శ్రేణులు మాత్రం ఉత్సాహంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుత పాదయాత్ర సెప్టెంబరు 12 ప్రారంభమైంది. హైకోర్టు తీర్పు తర్వాతి పరిణామాలతో అక్టోబరు 20 వరకు కొనసాగింది. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం దగ్గర పాదయాత్ర ఆగిపోయింది. పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేయడం, అందరూ గుర్తింపు కార్డులు చూపించాలని చెబుతూ ఉండడంతో ఆ తర్వాత పాదయాత్రను నిలిపి వేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.
అనంతరం పాదయాత్ర వ్యవహారం హైకోర్టుకు చేరింది. రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్లు దాఖలు చేశారు. పాదయాత్రను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అలాగే పాదయాత్రలో 600 రైతులు మాత్రమే పాల్గొనాలని తేల్చి చెప్పింది. పాదయాత్రకు విధించిన షరతులను తీసివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టేసింది.
గతంలో ఇచ్చిన షరతులను మార్చేది లేదని, కచ్చితంగా షరతలకు లోబడే యాత్ర కొనసాగాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్న రైతులే పాదయాత్రలో పాల్గొనాలని, పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలియజేయవచ్చింది.
అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్ల బెలూన్లతో ఆందోళణకు దిగడంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోకి పాదయాత్ర చేరేసరికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చని పోలీసులు సహితం అనుమానిస్తున్నారు.