మూడు పార్టీల మధ్య పదవులు పంచుకోవడంలో ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా అనుసరించిన అనేక సమీకరణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు.. రాష్ట్ర మంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నిజానికి మూడు ఎంపీ స్థానాలను మూడు పార్టీలు పంచుకుంటారేమో అనే ప్రచారం జరిగినప్పటికీ.. జనసేన-బిజెపిలకు కలిపి ఒక సీటు కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించారు. ముందు హామీ ఇచ్చిన తర్వాతనే ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారని బిజెపి అనడంతో ఆయనకు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. తమకు దక్కిన రెండు స్థానాలను తెదేపా బీద మస్తాన్ రావు, సాన సతీష్ లకు ఇచ్చింది. ఈ పంపకాల్లో నాగబాబుకు.. ఎంపీ పదవికి బదులుగా అంతకంటె కీలకమైన రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఏపీకేబినెట్లో 25 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి 24 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క ఖాళీని నాగబాబుతో భర్తీ చేయబోతున్నారు. అయితే ముందుగా మంత్రిగా బాధ్యతలు అప్పగించేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా సభలోకి తీసుకువస్తారా? లేదా, ఎమ్మెల్సీ అయిన తర్వాత.. మంత్రిగా ప్రమాణం చేయిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ముందుగా నాగబాబును కేబినెట్లోకి తీసేసుకుంటారని, ఆ తర్వాత.. ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారని సమాచారం. ఆరునెలలలోగా ఎప్పుడైనా సరే.. చట్టసభల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మిస్సయితే మరో ఆరునెలలు కూడా మరోసారి మంత్రిగా ప్రమాణం చేయడం ద్వారా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. గతంలో నారా లోకేష్ ను మంత్రిగా తీసుకున్నప్పుడు కూడా ముందు మంత్రి పదవి ఇచ్చేసి, ఆ తర్వాత కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే సూత్రం ఫాలో కాబుతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే నాగబాబుకు ఏ శాఖలు కేటాయించబోతున్నారు.. అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి జనసేన మంత్రులకు, పవన్ కల్యాణ్ కు కేటాయించి ఉన్న శాఖల్లోనే కొన్నింటిని విడిగా చేసి నాగబాబుకు అప్పగిస్తారని కూడా అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్సీ కంటె ముందే నాగబాబుకు మంత్రిపదవి!
Sunday, December 22, 2024