టోఫెల్ ముసుగులో దోపిడీని ఎండగట్టిన జనసేన!

Sunday, November 10, 2024

అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తూ రకరకాల చిత్రవిచిత్ర పథకాలను ప్రారంభిస్తూ ఉంటే,  చూస్తూ ఊరుకోబోయేది లేదని,  విజిల్ బ్లోయర్ లాగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని..  ప్రజల తరఫున ప్రశ్నిస్తామని..  ప్రభుత్వపు దుర్మార్గ ఆలోచనలలో లోపాలను ఎత్తిచూపుతామని జనసేన నిరూపిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..  టోటల్ కు ఉచిత శిక్షణ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రత్యేక వృధా చేయడానికి,  ఆ రూపంలో వేలకోట్ల రూపాయలను అడ్డదారుల్లో దిగమింగడానికి ఒక స్కెచ్ రూపొందించుకుంటే  దానిని జనసేన సూటిగా ఎండగడుతోంది.  ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తోంది.

 జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ టోహల్ ఉచిత శిక్షణ రూపంలో జరుగుతున్న యావత్తు దోపిడీని చాలా విపులంగా వివరిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారు.  టోఫెల్ అనేది డిగ్రీ పూర్తి చేసిన తరువాత,  విదేశాలలో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు తమ ఇంగ్లీషు భాషా పరిజ్ఞానాన్ని నిరూపించుకోవడానికి రాయవలసిన పరీక్షలలో ఒకటి.  అయితే విదేశాల్లోని అన్ని యూనివర్సిటీలు కేవలం టోఫెల్ పరీక్షల మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తాయనేది కూడా ఏమీ లేదు.  కొన్ని యూనివర్సిటీలు టోఫెల్ ను పట్టించుకోవు కూడా.  అలాగే ఈ పరీక్షకు ప్రత్యామ్నాయాలు కూడా అనేకం ఉన్నాయి.  సాధారణంగా ఇది డిగ్రీ పూర్తి చేసిన తరువాత విద్యార్థులు రాసే పరీక్ష కాగా,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు నుంచి 10వ తరగతి వరకు  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు  టోఫెల్ కోసం ఉచిత శిక్షణ ఇప్పిస్తామంటూ ఒక ప్రహసనప్రాయమైన ప్రయత్నాన్ని ప్రకటించింది. 

 ఈ రూపంలో కేవలం టోఫెల్ సంస్థతో చేసుకుని ఒప్పందం ప్రకారం..  ఫీజులు రూపేణా ఏడాదికి 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తారని ఒక అంచనా.  ఒకసారి కోచింగ్ అనే ప్రహసనం మొదలైన తర్వాత..  విద్యార్థులకు మెటీరియల్,  పుస్తకాలు ఇతర సదుపాయాలు తదితర రూపేణా మరో 1000 కోట్ల రూపాయలకు పైగా  ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని..  ఇదంతా అప్పనంగా దోచుకుని దొంగ మార్గమనే నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు.  పేద విద్యార్థులకు మేలు చేస్తున్నాం అనే సాకుతో..  ఆరు నెలల్లో దిగిపోయే ప్రభుత్వం..  నాలుగేళ్ల పాటు మనుగడలో ఉండే డీల్ కుదుర్చుకోవడం ద్వారా..  వేలకోట్ల రూపాయల స్వాహాకు ప్రయత్నిస్తున్నదని ఆయన అంటున్నారు. 

మొత్తానికి ప్రజల తరఫున ప్రశ్నించే గళంగా నిలుస్తామని తొలి నుంచి ప్రకటిస్తున్న జనసేన.. టోఫెల్ ముసుగులో..  విచ్చలవిడి దోపిడీకి జరుగుతున్న ప్రయత్నాన్ని బట్టబయలు చేస్తోంది.  ప్రజలలో ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles