ఆయన తనను తాను ‘కాపుజాతిపిత’గా గుర్తించుకుంటారు. నికరంగా చెప్పాలంటే.. ఒకటిరెండు ఉద్యమాలు తప్ప ఆయన కాపుల కోసం చేసిందేమీ లేదు. కాపులను బీసీలుగా గుర్తించాలనే డిమాండ్ తప్ప వారికోసం మరొక కోరికను ఆయన వ్యక్తం చేసిందీ లేదు. అసాధ్యమైన, కాపు సామాజిక వర్గంలోనే బలంగా లేని, ఆ కోరికను సాధించిందీ లేదు. కాకపోతే.. ప్రతిసారీ ‘నా కాపు జాతికోసం నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నా.. నా కాపుజాతికోసం ఏమైనా చేస్తా..’ అంటూ పెద్దపెద్ద డైలాగులు వల్లిస్తూ ఉండే ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు ‘నా కాపుజాతి’ అనే అర్హతను కోల్పోయారు. ఎందుకంటే ఆయన పేరు ఇప్పుడు ‘ముద్రగడ పద్మనాభం రెడ్డి’!
రెడ్డి కులం తప్ప.. మరెవ్వరూ పేరు చివర ఆ పదాన్ని తగిలించుకోకూడదా? అని అంటే.. తగిలించుకోవచ్చు. మన రాష్ట్రంలో ఇతర కులాల్లో కూడా రెడ్డి అనే పేరున్న వారు బోలెడు మంది కనిపిస్తారు. దళితుల్లో కూడా కొందరు అలా పేర్లు పెట్టుకుంటారు. మదనపల్లెలో గతంలో ఎమ్మెల్యేగా చేసిన రాటకొండ సాగర్ రెడ్డి కుటుంబీకులు.. కమ్మవారే గానీ రెడ్డి అని పెట్టుకుంటారు. అలాగే మాజీ మంత్రి రఘువీరారెడ్డి కులం పరంగా యాదవుడైనా పేరులో రెడ్డి ఉంటుంది. కానీ వారి సంగతి వేరు.. ముద్రగడ సంగతి వేరు. వారు కేవలం పేరుకు మాత్రమే రెడ్లు. కానీ ముద్రగడ మనసా, వాచా, బుద్ధిపరంగా రెడ్డిగా మారిపోయారు.
ఈ ఎన్నికల్లో పిఠాపురం సీటులో పవన్ కల్యాణ్ ను ఓడించి తీరుతానని, ఆయనను ఓడించలేకపోతే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానని.. డాంబికానికి పోయి ప్రతిజ్ఞ చేసిన ఫలితం ఇది. వైసీపీ దారుణంగా ఓడిపోయిన తరువాత.. ఆయన గెజిట్ కు తన పేరు మార్పుకోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ కాపుజాతిపిత- తన కాపుజాతిమీద నైతిక హక్కును కోల్పోయినట్టు అయింది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడానికి సంబంధించి.. ఆయన ఇంకేదైనా ప్రతిజ్ఞ చేసి ఉంటే బాగుండేది. కానీ.. అక్కడి పోరాటం.. కాపులకు- రెడ్లకు అయినట్టుగా (నిజానికి పవన్ ప్రత్యర్థి వంగా గీత కూడా కాపునే) ముద్రగడ రంగు పులిమారు. అక్కడికేదో తాను రెడ్ల పార్టీకి సర్వసైన్యాధిపతి అయిన కట్టప్ప అన్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారు. ఓడిపోతే.. పేరు చివర రెడ్డి పెట్టుకుంటానన్నారు. ఇప్పుడు మాట మీద నిలబడి రెడ్డిగా మారిపోయారు. కొన్నేళ్లుగా చేస్తూ వచ్చిన అతి కి తగిన శాస్తి జరిగిందని కాపు నాయకులే అనుకుంటున్నారు.
‘నా కాపుజాతి’ అనే అర్హత కోల్పోయిన ముద్రగడ రెడ్డి!
Wednesday, January 22, 2025