పల్లా మాటలతో ఆశావహుల్లో కదలిక!

Thursday, October 17, 2024

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొత్తం ఆరు నెలల వ్యవధిలోగా పూర్తి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో- కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ఆశావాహుల్లో చురుకుదనం వచ్చింది. అందరూ తమ అర్హతలను ప్రచారం చేసుకుంటూ తమకు మేలు చేయగల నాయకులను ఆశ్రయించి వారి ద్వారా నామినేటెడ్ పోస్టులు పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా తమ తమ ఎమ్మెల్యేల ద్వారా అధినాయకులను సంప్రదిస్తూ స్థానికంగా నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకునే ప్రయత్నాలలో పడ్డారు. పెద్ద పదవులను ఆశిస్తున్న సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. నామినేటెడ్ పదవుల ఆబ్లిగేషన్ తో చంద్రబాబు నాయుడు ఎవరిని తన వద్దకు రానివ్వడం లేదు. కొందరు మంత్రులు పార్టీ సీనియర్లను పురమాయించి అనేక రకాల వడపోతల తరువాత తుది ప్రాబబుల్స్ జాబితాతో మాత్రమే తన వద్దకు రావాలని ఆయన పురమాయించినట్లుగా సమాచారం.
టిటిడి చైర్మన్ బోర్డు సభ్యులు వంటి అత్యంత విలువైన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే చంద్రబాబు దృష్టిలో కొన్ని పేర్లు ఉన్నాయని, మిగిలిన ఆశావహులను ఇతర నామినేటెడ్ పోస్టులలో సర్దుబాటు చేసిన తర్వాత వారిని ఆ విధంగా బుజ్జగించిన తర్వాత టీటీడీ బోర్డు ప్రకటన ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

నామినేటెడ్ పోస్టుల కోసం ఆశపడే వారి సంఖ్య తెలుగుదేశంలో కంటే కూటమి భాగస్వామి పార్టీలైన జనసేన బిజెపిలలో ఇంకా ఎక్కువగా ఉంది. తమ పార్టీలతో జట్టు కట్టడం వల్ల మాత్రమే తెలుగుదేశం గెలిచింది. తాము తక్కువ స్థానాలు తీసుకొని తెలుగుదేశం అధికారం ఏర్పడడానికి సహకరించాం. కనుక నామినేటెడ్ పోస్టులలో తమకి ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి అనే తరహాలో వారంతా వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లను నామినేటెడ్ పోస్టుల కోసం ఆశ్రయిస్తున్నారు. బిజెపి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలు ఏఏ పేర్లు చెబితే వారికే నామినేటెడ్ పోస్టులన్నీ కేటాయించడానికి సిద్ధపడినట్లు సమాచారం. బిజెపిలోని ఆశావహులు ఢిల్లీ చుట్టూ తిరగడం జరుగుతుంది. మొత్తానికి పల్లా శ్రీనివాసరావు చెప్పినట్టు మరో ఆరు నెలలలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ మొత్తం పూర్తయ్యేటట్లయితే అప్పటిదాకా ఆశావహుల హడావుడి నడుస్తూనే ఉంటుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles