వంశీ దందాలపై సిద్ధమవుతున్న మరిన్ని కేసులు!

Monday, December 15, 2025

ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే చాలా మంది నాయకులు తమకు కొమ్ములు మొలిచాయని అనుకుంటారు. గెలిచేదాకా ప్రజలకు సేవ చేయడం తప్ప తమ జీవితానికి వేరే పరమార్థం లేనేలేదని సుద్దులు చెబుతారు. గెలిచిన వెంటనే.. ఇక తమ విచ్చలవిడి దందాలను ప్రారంభిస్తారు. తాము దోచుకోవడం మాత్రమే కాదు.. తమ అనుచరులందరూ కూడా దోపిడీలు కొనసాగించాలని, వారందరూ ఆర్థికంగా పుష్టిగా తయారై తనకు అండగా నిలుస్తుండాలని ఆరాటపడతారు. అందుకే అనేకానేక అనుచిత పంచాయతీలు, సెటిల్మెంట్లు కూడా చేస్తుంటారు. కానీ విధి వికటిస్తే.. ప్రతి అక్రమ దందాకు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ఏక కాలంలో మూడు కేసుల్లో రిమాండు శిక్షలను అనుభవిస్తున్నారు. తాజాగా మూడో రిమాండును ఆయనకు కోర్టు విధించింది. అది బెదిరింపులు, అనుచరుల కోసం చేసిన సెటిల్మెంటు పంచాయతీ కేసు కావడం విశేషం.
బెదిరించి భూములను విక్రయించిన కేసులో వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు రిమాండు విధించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్న వంశీని పోలీసులు పీటీ వారెంటుపై అరెస్టు చేసి తీసుకువచ్చి.. కోర్టు ఎదుట హాజరుపరిచారు. తన అనుచరులతో కలిసి వంశీ బెదిరింపులకు పాల్పడి.. 8.91 ఎకరాల భూములను అమ్మేశారంటూ.. తేలప్రోలుకు చెందిన ఎస్.శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది. ఆ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు.

అయితే ఇప్పుడు వంశీకి మరో ముప్పు ఎదురవుతోంది. గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఇన్నాళ్లూ తనకు ఎదురేలేదన్నట్టుగా వ్యవహరించారు. విచ్చలవిడిగా దందాలు చేశారు. పంచాయతీలు సెటిల్మెంట్లు బెదిరింపులు, కొనుగోలు పేరుతో భూకబ్జాలు వంటివి లెక్కేలేదు. అయితే ఆయన చేతిలో అధికారంలో ఉండడంతో ప్రజలు కూడా దక్కినదే తమకు ప్రాప్తం అనుకుని మిన్నకుండిపోయారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. సత్యవర్ధన్ కేసులో అరెస్టు కావడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులతో ఇతరుల  భూమిని విక్రయించడం అనే కేసు మరొక ఎత్తు. శ్రీధర్ రెడ్డి పెట్టిన ఆ కేసు పలువురికి స్ఫూర్తి ఇస్తోంది. గతంలో వంశీ అరాచకాలకు, దందాలకు బలైపోయిన పలువురు ఇప్పుడు తాము కూడా కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. వంశీ వల్ల తాము ఏవిధంగా నష్టపోయామో తెలియజేస్తూ.. తమకు న్యాయం జరిగేలా చూడాలని గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలువురు తెలుగుదేశం నాయకులను ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వంశీ మూడో రిమాండులో ఉండగా.. మరిన్ని కేసులు కూడా నమోదు కానున్నాయని స్థానికులు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles