‘నువు చెప్పింది నిజమే. సిటీలో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసోడై ఉండాలి’ ఈ డైలాగు వెంటే ఏదైనా సినిమా గుర్తుకొస్తోందా? అవున్నిజమే. ఇలాంటి సినిమా డైలాగులు మనకు చాలా వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మోనార్క్ నాయకుడిగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా ఇలాంటి డైలాగును గుర్తుచేసేవిధంగా సాగుతున్నది. ‘పార్టీలో ఒక్కడే స్టార్ ఉండాలి.. ఆ స్టార్ జగన్ అ యి ఉండాలి’ అన్నట్టుగా ఆయన రాజకీయం సాగిపోయింది. నిజానికి అదే ఎన్నికల్లో కొంపముంచింది కూడా. ఇప్పుడు కూడా పరిస్థితి ఏమీ మారలేదు గానీ.. ఎన్నికల నాటికి వాతావరణం అలాగే సాగినట్టు ఇప్పుడు కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చాయి.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 328 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా.. కేంద్ర ఎన్నికల సంఘానికి లెక్కలను సమర్పించింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన మార్చి 16 నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 6 వరకు పెట్టిన మొత్తం ఖర్చులు ఇవే అని నివేదించింది. ఇందులో కేవలం మీడియాలో ప్రచారానికి, అనగా టీవీచానెళ్లు, పత్రికలు, సోషల్ మీడియా ప్రచారాలు అన్నీ కలిపి 87.36 కోట్లు వెచ్చించారు. స్టార్ క్యాంపెయినర్ల ప్రచారానికి.. అనగా, హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్, బస్సులు తదితరల అవసరాల కోసం ఏకంగా 21.42 కోట్లు ఖర్చు చేశారు. తమాషా ఏంటంటే.. ఈ స్టార్ క్యాంపెయినర్ల ఖర్చు అనగా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన ఖర్చు మాత్రమే. ఈ మొత్తంలో 21.41 కోట్లు ఆయన ఒక్కడికోసమే వెచ్చించినట్టుగా వైసీపీ నివేదిక చెబుతోంది. మరి మిగిలిన ఒక లక్ష రూపాయలు ఎవరికోసం ఖర్చు చేశారో తెలియదు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ విజయం అనేది తన ఒక్కడి చేతుల మీదుగానే జరగాలని కోరుకున్నారు. తాను తప్ప పార్టీని ఉద్ధరించడానికి మరొకరు అవసరం లేదని ప్రపంచానికి నిరూపించాలని అనుకున్నారు. ఆయన సొంత కుటుంబంలో 2019 ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు కూడా అందుకు కారణం. 2019 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ విజయం తర్వాత.. తమకు కూడా రాజకీయ ప్రాధాన్యం దక్కాలని కోరుకుని భంగపడ్డారు. జగన్ వారిని దూరం పెట్టారు. వారివల్ల పార్టీ గెలవలేదు అని చాటిచెప్పడానికి.. అసలు తాను తప్ప మరో వ్యక్తి ప్రచారానికి వెళ్లకుండా అంతా తానై మోనార్క్ లాగా నడిపించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.
నిజానికి కులాల వారీగా అయినా సరే.. తమ ప్రాధాన్యం గుర్తించి తమను జగన్ స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకుంటారని పలువురు సీనియర్లు, బీసీ, ఎస్సీ నాయకులు భావించారు. అయినా జగన్ ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. ముద్రగడ వంటి వారు కాపు కులం ఓట్లను చీల్చగలం అనే నమ్మకంతో వైసీపీలో ఎన్నికల ముందు చేరినప్పటికీ.. ఆయనను కూడా కేవలం ఇంటికే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుడుకు పోకడల ఫలితంగానే పార్టీని ఈ స్థాయి పతనానికి తీసుకువెళ్లారు. సొంతపార్టీలో తాను తప్ప మరొక్క నాయకుడికి విలువ ఇవ్వడం కూడా తెలియని ఆయన పోకడల వల్లనే ఈ పతనం వచ్చిందని అంతా అనుకుంటున్నారు.
మోనార్క్ జగన్ : ఆ పార్టీలో ఒకే ఒక్క స్టార్!
Saturday, November 23, 2024