ప్రపంచం మొత్తం కూడా మదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాను నిర్వహించే వారు.. రాష్ట్రంలోని తల్లులందరికీ ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తే చేయవచ్చు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం తన కన్నతల్లికి ఫోను చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతారో లేదో. అలా మదర్స్ డే రోజున కన్నతల్లిని పలకరించడానికి ఆయనకు సరైన మూడ్ ఉంటుందో లేదో అనే ఊహాగానాలు ఇప్పుడు ప్రజల్లో రేగుతున్నాయి. ఏపీ ఎన్నికల రాద్ధాంతానికి దూరంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. ఈవీడియో సందేశంలో ఆమె.. జగన్ యొక్క తాజా ప్రత్యర్థి, ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని, ఆమెను కడప ఎంపీగా గెలిపించాలని కోరడమే అందుకు కారణం.
వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మదర్స్ డే కు ఒక రోజు ముందుగా ఆ వీడియో వ్యాప్తిలోకి వచ్చింది. ఆ వీడియోలో ఆమె తన కుమార్తె షర్మిలకు కడప నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని, ప్రజలకోసం సేవ చేసే అవకాశం ప్రసాదించాలని అభ్యర్థించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ప్రజల్లో అపారమైన ఆదరణ, ఆయన పట్ల భక్తివిశ్వాసాలు ఉన్నాయి. ఆయన మరణించిన తర్వాత ఆయన కొడుకు జగన్ ను ఎంతగా అభిమానించారో, అంతకంటె ఎక్కువ అభిమానం గౌరవం ఆయన భార్య విజయమ్మ మీద కూడా అక్కడి ప్రజల్లో ఉన్నాయి.
ఇప్పుడు షర్మిల ఆ నియోజకవర్గంలో ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీచేస్తూన్న తరుణంలో.. వచ్చిన విజయమ్మ వీడియో వైఎస్ఆర్ అభిమానుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అందరూ నమ్ముతున్నారు.
విజయమ్మ తన వీడియోలో.. భర్త రాజశేఖర రెడ్డికి ఉన్న జనాదరణ, ప్రజలు ఆయనను ప్రేమించిన తీరు, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన మాదిరిగానే కడప ప్రజలకు సేవ చేయడానికి షర్మిల ఇవాళ మీ ముందుకు వస్తున్నదని విజయమ్మ అందులో చెప్పారు. ఆయన బిడ్డను అందరూ ఆశీర్వదించాలని కోరారు. వీడియోలో విజయమ్మ నామమాత్రంగానైనా వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావించలేదు. అలాగని వివేకానందరెడ్డి హత్య వ్యవహారం కూడా ఎత్తలేదు. కేవలం తన బిడ్డకు ఓటు వేయమని మాత్రం కోరారు.
ఈ వీడియోద్వారా.. జగన్ తో విభేదాలు కేవలం చెల్లెలు షర్మిలకు మాత్రమే కాదని, తల్లి విజయమ్మకు కూడా ఉన్నాయని తేలిపోయింది. ఈ ఇద్దరూ ఎన్నికల గోదాలోకి దిగిన తర్వాత.. అమెరికా వెళ్లిపోయిన విజయమ్మ ఇన్నాళ్లూ అసలు ఎక్కడా వార్తల్లో కనిపించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున కూతురుకోసం వీడియో సందేశం విడుదల చేశారు.
ఈ వీడియో కడప ప్రజలను ఉద్దేశించినదే అయినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ అభిమానుల మీద ప్రభావం చ చూపిస్తుందని పలువురు అనుకుంటున్నారు.
అమ్మ వీడియో : జగన్ కు మదర్స్ డే షాక్ !
Wednesday, January 22, 2025