వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయనకు ఢిల్లీలో అటు ప్రధాని మోడీ వద్ద గానీ, హోం మంత్రి అమిత్ షా వద్ద గానీ ఒక పట్టాన అపాయింట్మెంట్ దొరికేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పైగా.. రాజ్యసభలో ఎన్డీయే కూటమికి ఎప్పుడు అవసరం వచ్చినా తమ పార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా వేయిస్తూ సహకరిస్తున్న నాయకుడు. అయినా కూడా.. ఢిల్లీ వెళ్లి రెండు మూడు రోజుల పాటు అక్కడే వెయిట్ చేసి.. అపాయింట్మెంట్ దొరక్క తిరిగివచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది.. మోడీతో భేటీ ఇప్పుడు కుదురుతుంద? ఏదైనా సరైన పర్పస్ కోసం వెళితే.. ఎప్పుడైనా ఎవరినైనా ప్రధాని కలుస్తారు. అలా కాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి అబద్ధాలను, దుర్మార్గమైన దుష్ప్రచారాలను కొనసాగించడానికి అపాయింట్మెంట్ అడిగితే దొరుకుతుందా? అనేది పలువురి సందేహం.
గతంలో సీఎంగా ఉన్నప్పటికీ కూడా జగన్ కు మోడీ, అమిత్ షా ల అపాయింట్మెంట్ లు దొరక్కపోవడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి. భేటీ జరిగితే.. ఈయన చెప్పబోయే మాటలు ఏమిటో వారిద్దరికీ చాలా బాగా తెలుసు. తన మీద ఉన్న సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలని, బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తమ్ముడు అవినాష్ రెడ్డికి విముక్తి కల్పించాలని అడగడానికి మాత్రమే జగన్ అపాయింట్మెంట్ కోరుతారనేది వారి అభిప్రాయం. అందుకే అనేకమార్లు తిరస్కరిస్తుండేవారు.
అలాంటిది ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి జగన్ అపాయింట్మెంట్ కోరితే ఇస్తారా? అనేది ప్రజల సందేహం. ఎందుకంటే.. జగన్ ప్రధానిని కలవాలని అనుకోవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయనేది ప్రజల అనుమానం. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వ అరాచకాల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. చీమల పుట్ట పగిలినట్టుగా.. జగన్ ప్రభుత్వ అవినీతి బాగోతాలు పుంఖానుపుంఖాలుగా బయటకు వస్తున్నాయి. వివరాలన్నీ సేకరించి వీటి మీద దర్యాప్తుల పర్వం మొదలయ్యేసరికి.. జగన్ ప్రభుత్వంలోని సగానికి పైగా మంత్రులు సహా.. జగన్ కూడా ఈ అవినీతి కేసుల్లోనే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం ఆయనకు ఉంది. ఆ కేసులకు సంబంధించి తనను చంద్రసర్కారు అరెస్టు చేయకుండా పైనుంచి ఆదేశించాలని మోడీని కోరాలనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. రాజ్యసభలో వారికి అవసరమైన ప్రతిసారీ.. తన ఎంపీలతో అనుకూల ఓటు వేయిస్తాననేది ఆయన చెప్పగల బేరం. అయితే.. జగన్ చెప్పే అబద్ధాలు వినడం కోసం మోడీ అంత ఖాళీగా ఉన్నారా? అపాయింట్మెంట్ దొరకడం అంత వీజీనా అని పలువురు సందేహిస్తున్నారు. కావాలంటే జగన్ ఢిల్లీలో ధర్నా చేయగలరు గానీ.. మోడీని కలవలేరు అని అంటున్నారు.
మోడీ అపాయింట్మెంట్ అంత వీజీనా జగనన్నా!
Tuesday, January 21, 2025