ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయం పై ఆశలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల్లో స్పందన చాలా బాగా ఉంటున్నదని, ఇంకాస్త గట్టిగా కసరత్తు చేస్తే తప్పకుండా తిరుగులేని మెజారిటీతో అత్యధిక స్థానాలను కూటమి సొంతం చేసుకోగలదని అభ్యర్థులు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఆత్మరక్షణ ధోరణిలో పడుతోంది అనే సంగతి కూడా వారు గుర్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతం అయిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో మరిన్ని సభలలో పాల్గొనేలా ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యూహకర్తలు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఉమ్మడిగా వ్యూహరచన చేస్తున్న నాయకుల నుంచి కమల దళం పెద్దలకు ఒక విజ్ఞప్తి వెళుతోంది. “మోడీ గారికి స్క్రిప్ట్ మార్చండి సార్.. దుర్మార్గమైన జగన్ పాలన పట్ల అంత మెతకగా మాట్లాడితే కుదరదు” అని విన్నవించుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు బహిరంగ సభలలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చిలకలూరిపేట సభ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో మోడీ హాజరయ్యే మిగిలిన నాలుగు సభలను మరింత భారీగా నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. సొంతంగా మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని బిజెపి కూడా ఆలోచిస్తుంది. ఈనెల ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట లేదా కడప స్థానాలు తో పాటు మరొక చోట కూడా బహిరంగ సభల్లో పాల్గొనాలని ప్రస్తుతానికి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.
మోడీ సభలకు విశేష ప్రజాదరణ ఉంటుంది. ఆయన ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూస్తారు.. అనడంలో సందేహం లేదు గాని, ఆయన జగన్ మోహన్ రెడ్డి సర్కారు అరాచకాలను ప్రశ్నించే విషయంలో మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చిలకలూరిపేట సభలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలి అనే టార్గెట్ ను పదేపదే ప్రజలకు వినిపించడం తప్ప జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ప్రజాకంటక మైనదో సమర్థంగా మోడీ చెప్పలేకపోయారనే ఆలోచన చాలా మందిలో ఉంది. అదే ఇతర రాష్ట్రాలలో మోడీ ప్రసంగాలు స్థానిక భాజపాయేతర ప్రభుత్వాల మీద తీవ్ర స్థాయిలో చేసిన దాడిలాగా ఉంటున్నాయి. ఏపీలో అంత తీవ్రత లేదనే అభిప్రాయం పలుగురిలో ఉంది.
అలా కాకుండా రాష్ట్ర బిజెపి నాయకులు నరేంద్ర మోడీకి సర్దిచెప్పి ఆయనతో మరింత ఘాటైన విమర్శలు చేయిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పతనం మరింతగా సులభ సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. మోడీ సాధారణంగా స్థానిక నేతలు ఇచ్చే స్క్రిప్టు అంశాలనే ఫాలో అవుతారు గానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ అరాచకాలను నిలదీయడానికి ఆయన ఎంత మేరకు సంసిద్ధంగా ఉంటారో వేచిచూడాలి.