అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభం, నవనగరాల నిర్మాణానికి శంకుస్థపన తదితర కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. మే2వ తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రాజధాని పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని చేతులమీదుగానే పునఃప్రారంభ కార్యక్రమం కూడా జరగాలని చంద్రబాబునాయుడు పట్టుపట్టడంతో ఈ ముహూర్తం ఖరారైంది. ఈ నెలలో ప్రధాని వివిధ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నందువల్ల మే2వ తేదీన ముహూర్తం నిర్ణయించారు.
ప్రధాని చేతుల మీదుగా జరిగే పునఃప్రారంభ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయడానికి మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు అయింది. భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఎస్పీజీ బృందాలే ఇప్పటికే రంగంలోకి దిగాయి. ప్రస్తుతం వెలగపూడి సచివాలయం వెనుకవైపున ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.
ఈసారి శంకుస్థాపన తర్వాత అమరావతి నిర్మాణ పనులు జరిగే తీరు నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణ పనుల్లో ఐదువలే మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. నెలాఖరు నాటికి వీరికి తోడు మరో 15 వేల మంది కార్మికులు పనుల్లోకి వస్తారని అంచనా. అలాగే ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా మొదలైతే ఇంకా నిర్మాణ కార్యకలాపాల ఉధృతి పెరుగుతుంది. మే1వ తేదీ నాటికి ఐకానిక్ సెక్రటేరియేట్ టవర్ల టెండరుదారులు కూడా ఖరారవుతారు.
తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో కూడా శంకుస్థాపన తరువాత.. చాలా ముమ్మరంగానే పనులను ప్రారంభించారు. అయితే.. అప్పట్లో అంతా పునాదుల స్థాయి వరకు నిర్మాణపనులు చేపట్టడానికే ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంది గనుక.. చేసిన పనులు పెద్దగా ప్రొజెక్టు కాలేదు. 70-80 శాతం పనులు పూర్తయిన జడ్జిల క్వార్టర్లు, అధికారుల క్వార్టర్లు లాంటి పనులను జగన్ అధికారంలోకి రాగానే.. సర్వనాశనం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా వేగంగా పూర్తి కాబోతున్నాయి. ఒక ఏడాదిలోనే ఈ నివాస భవన సముదాయాలన్నీ వాడుకలోకి వచ్చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
అన్నింటికంటె మించి పెద్ద ఎడ్వాంటేజీ ఏంటంటే.. ఈసారి నిర్మాణ పనులకు నిధుల కొరత ఏమాత్రం లేదు. ప్లాన్ చేసిన అన్ని నిర్మాణ పనులకు సంబంధించి అవసరరమైన రుణాలకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. తొలివిడతలు విడుదల అయ్యాయి కూడా. కేంద్రం నుంచి కూడా నిధుల పరంగా పూర్తి సహకారం అందుతోంది. ఈ నేపథ్యంలో మోడీ చేతుల మీదుగా ముహూర్తం జరగడమే తరువాయి.. పనులు శరవేగంగా సాగుతాయని అంతా అంటున్నారు.
అమరావతికి 2న మోడీ : ఘనంగా పునఃప్రారంభం
Monday, December 8, 2025
