ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనే ఉండేదే.1.14 లక్షల మంది కూర్చొని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాట్లు ఉన్న దీని పేరు నరేంద్ర మోడీ స్టేడియం! ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే స్థాయిలో నిర్మాణ పనులకు సిద్ధమవుతున్న అమరావతి రాజధాని నగరంలో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం కంటే పెద్దదైన క్రికెట్ స్టేడియం నిర్మించాలనే ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తోంది. 1.25 లక్షల మంది కూర్చొని వీక్షించేలాగా ఈ స్టేడియం నిర్మాణ ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. 100 ఎకరాలకు పైగా స్థలంలో నిర్మాణం అవుతున్న కాబోతున్న క్రికెట్ స్టేడియం కోసం అయ్యే వ్యయంలో 60 శాతం భరించడానికి బీసీ సీఐ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది మిగిలిన 40 శాతం మాత్రం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భరించాల్సి వస్తుంది. ఇది కార్య రూపంలోకి వస్తే గనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో అద్భుతాన్ని కానుక అందించినట్లే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ సర్కారు ప్రస్తుతం మొత్తం 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణాన్ని ప్లాన్ చేస్తోంది. ఇబ్రహీంపట్నం సమీపంలో ఉండే పెదలంక, చినలంక గ్రామాల్లో భూములను ఇందుకోసం పరిశీలిస్తున్నారు. కృష్ణానదీ తీరంలో ఐకానిక్ వంతెనకు పక్కగానే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపాదిత భూములను మునిసిపల్ మంత్రి నారాయణ, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని కలిసి పరిశీలించారు. ఈ గ్రామాల పరిధిలో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆల్రెడీ రెండు చిన్న క్రికెట్ స్టేడియంలు కూడా ఉన్నాయి.
తొలుత స్పోర్ట్స్ సిటీని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించాలని అనుకున్నారు. అయితే ఆ మహానగరంలో భూముల లభ్యత తక్కువగా ఉండడం వల్ల కొత్తస్థలం ఎంపిక చేశారు. భూములకు పరిహారం చెల్లించి.. స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయిస్తారు.
1.25 లక్షల సీటింగ్ కెపాసిటీతో స్టేడియం వస్తే గనుక.. దేశంలో అతిపెద్దది అవుతుంది. నిర్మాణ వ్యయమే కాకుండా మౌలిక వసతుల ఖర్చులనుకూడా కొంత భరించడానికి బీసీసీఐ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. స్టేడియం పూర్తయితే ఏడాదిలో కనీసం పది అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా అవకాశం కల్పించేందుకు కూడా బీసీసీఐ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఇటీవల దుబాయి, విశాఖపట్నంలలో క్రికెట్ మ్యాచ్ లకు హాజరైనప్పుడు.. ఐసీసీ ఛైర్మన్ జైషాతో ఈ మేరకు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్ సిటీ కార్యరూపం దాలిస్తే గనుక.. దేశంలో ఒక ప్రధాన స్పోర్ట్స్ హబ్ గా వెలుగొందుతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
మోడీ స్టేడియం తలదన్నేలాగా అమరావతిలో..
Saturday, April 26, 2025
