బిజెపి నాయకత్వంపై అసహనంతో ఎమ్మెల్యే రాజాసింగ్ 

Wednesday, December 18, 2024

మొత్తం తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, మొత్తం పార్టీ కాదన్నా సొంత బలంతో ఎమ్యెల్యేగా గెలుస్తూ వస్తున్న రాజాసింగ్ బీజేపీ నాయకత్వం పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తున్నది. తనపై అక్రమంగా కేసులు బనాయించి, కేసీఆర్ ప్రభుత్వం పిడి చట్టం కింద అరెస్ట్ చేసి,  జైలులో ఉంచితే, మద్దతుగా రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఎవ్వరు రాకపోవడం పట్ల ఆగ్రంతో ఉన్నట్లు చెబుతున్నారు. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పిడి చట్టం కింద అరెస్ట్ అయినా మొదటి ఎమ్యెల్యే రాజాసింగ్ కావడం గమనార్హం. కనీసం అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ పార్టీ ఎక్కడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కేవలం కొందరు మద్దతు దారులు, హిందుత్వ కార్యకర్తలు మాత్రమే అక్కడక్కడా నిరసనలు చేపట్టారు. 

తానేదే మొహమ్మద్ ప్రవక్త పట్ల అపచారం చేసే విధంగా మాట్లాడినట్లు పోలీసులు కేసు నమోదు చేస్తే, వాస్తవాలు బేరీజు వేసుకోకుండా తనను వెంటనే పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేయడం, రాష్ట్ర హైకోర్టు పిడి చట్టం కింద తన అరెస్ట్ చెల్లదని స్పష్టం చేస్తూ, జైలు నుండి విడుదల చేసినా ఇప్పటి వరకు సస్పెన్షన్ రద్దు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. 

జైలులో ఉన్న సమయంలో ఎప్పుడు బైటకు రాని భార్య ఉషాభయి బిజెపి కార్యాలయంకు, నాయకుల వద్దకు వచ్చి తన భర్తపై సస్పెన్షన్ రద్దు చేయమని కోరినా కనీసం సానుభూతి కూడా చూపిన దాఖలాలు లేవు. కేవలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం జైలు నుండి వచ్చాక రాజాసింగ్ ను ఓ సారి కలిసి పరామర్శించారు. సస్పెన్షన్ రద్దు పట్ల పార్టీ జాతీయ నాయకత్వం సానుభూతితో ఉందని భరోసా ఇచ్చారు. 

ఇక, హైదరాబాద్ నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు రాజాసింగ్ ను పరామర్శించిన దాఖలాలు లేవు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్యెల్యే అయినా రాజాసింగ్ కు సీట్ ఇవ్వరాదని నాటి రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, కిషన్ రెడ్డి,  ఇతర నాయకులు పట్టుబట్టారు. చివరకు ఆర్ఎస్ఎస్ నేతలు సహితం సీట్ ఇవ్వరాదన్నారు. 

హిందువులలో సొంత ఇమేజ్ పెంచుకొంటూ పోతున్నారని, తెలంగాణాలో అన్ని జిల్లాలో పార్టీ శ్రేణులలో ఆయన పట్ల అభిమానం పెరుగుతున్నదని ఓ విధంగా వారంతా ఆయన పట్ల వ్యతిరేకత పెంచుకున్నట్లు తెలుస్తున్నది. అయితే అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సొంతంగా జోక్యం చేసుకొని సీట్ ఇవ్వడంతో ఏమీ చెయ్యులకు పోయారు. ఆయన నియోజకవర్గంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా మరే  బిజెపి నాయకుడు ప్రచారంకు రాలేదు. 

అయినా, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి వారంతా ఓటమి చెందగా, తెలంగాణ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. అయినప్పటికీ పార్టీ నిబంధనావళి ప్రకారం శాసనసభాపక్ష నేతగా తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇప్పుడు పార్టీ నుండి సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితులలో సహితం ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తున్నది. 

ఇటీవల బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు ఆటంకం కలిగించి, అరెస్ట్ చేసిన సందర్భంగా ఖండించిన రాజాసింగ్ కేవలం ఓ బిజెపి కార్యకర్తగా ఖండిస్తున్నానని, సస్పెన్షన్ లో ఉండడంతో ఇప్పుడు తాను బిజెపి ఎమ్యెల్యేను కాదని అసహనంగా పేర్కొనడం గమనార్హం. 

తన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన పదే పదే పార్టీ  నాయకత్వాన్ని కోరుతున్నా వారి నుంచి ఈ విషయంలో సానుకూల స్పందన మాత్రం రావడం లేదు. అందుకు కొందరు స్థానిక బీజేపీ నాయకులే కారణంగా భావిస్తున్నారు.  అయితే ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని.. మళ్లీ ఆయనను పార్టీలోకి తీసుకుంటారని రాజాసింగ్ అనుచరులు, మద్దతుదారులు భావించారు. 

పైగా, వచ్చే ఎన్నికలలో రాజాసింగ్ ను కాదని ఆయన నియోజకవర్గంలో మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు చాటుమాటుగా పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆయన స్థానంలో ఇప్పటికే మరో నేతను ప్రొత్సాహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. 

గతంలో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను గోషామహల్ నుంచి బరిలోకి దింపే యోచనలో బీజేపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అతనికి స్పష్టమైన సంకేతం ఇవ్వడంతో బయటపడకుండా లోపాయికారిగా  ఆయన కొంతకాలంగా గోషా మహల్‌లో  పని చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రాజాసింగ్ భావించారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే సీటు ఏ ప్రశ్నార్ధకంగా మారితే ఇక ఎంపీ సీటు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles