మిథున్ రెడ్డి గాలితీస్తున్న మాణిక్కం సూటిప్రశ్న!

Thursday, December 4, 2025

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల పరంగా ఉన్న బలం చాలా తక్కువ. కానీ ఆ పార్టీ కీలక నాయకులు సంధిస్తున్న విమర్శనాస్త్రాలను గమనిస్తే అవి ప్రజలలో రేకెత్తించే ఆలోచనలు మాత్రం చాలా తీవ్రమైనవి- అని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్.. తాజాగా మధ్యంతర బెయిలు మీద బయటకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డికి ఒక సవాలు విసురుతున్నారు. దీనిని గమనిస్తే మాణిక్యం సవాలు చాలా సహేతుకమైనది అని మనకు అనిపిస్తుంది. ఇది నిజంగా మిథున్ రెడ్డి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతిపాదనగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన ఆత్మగౌరవ పరిరక్షణకు మొగ్గుతారా లేదా రాజకీయ దౌర్భాగ్యానికి లోనవుతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది!

మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన లిక్కర్ కుంభకోణంలో.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అత్యంత కీలక సూత్రధారులలో ఒకరిగా అరెస్టు చేసి రిమాండులో ఉంచిన సంగతి అందరికీ తెలుసు. అరెస్టు అయిన తొలిరోజునుంచే.. ఎంపీ మిథున్ రెడ్డి.. తాను బెయిలు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ లోగా, ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నికలు జరుగుతుండడంతో.. ప్రస్తుతం ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు అయింది. మంగళవారం నాటి పోలింగులో ఓటు వేసి తర్వాత ఆయన 11వ తేదీన తిరిగి రాజమండ్రి జైలులో లొంగిపోవాల్సి ఉంటుంది. ఆయన ఎవరికి ఓటు వేస్తారు? అనేది ఇప్పుడు రాజకీయాల్లో రేగిన చర్చ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. బేషరతుగా ఎన్డీయే అబ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతకు మించి గత్యంతరం లేదు. ఎన్డీయే పెద్దలు ఫోనుచేసి అడిగిన తర్వాత వారి మాటను శిరసావహించక భిన్నంగ వ్యవహరించే ధైర్యం లేదు. దీంతో ఆ పార్టీ ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించేశారు.  ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఎన్డీయేకే ఓటు వేయాలి. సరిగ్గా ఈ పాయింటు పట్టుకున్నారు.. మాణిక్కం ఠాకూర్!

మిథున్ రెడ్డి.. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఎన్డీయే వారి అభ్యర్థికి ఓటు వేస్తారా? లేదా, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా? అని అడుగుతున్నారు. ఇది నిజంగా మిథున్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నే.

మిథున్ ఎన్డీయేకు ఓటు వేయడం అంటే.. ఎన్డీయేను సమర్థించడమే. తన అరెస్టు, లిక్కర్ కుంభకోణం కేసులతో సహా వారి చర్యలను, నిర్ణయాలను కూడా సమర్థిస్తున్నట్టే. తాను నిర్దోషిని అని చెప్పుకునే మాయ మాటలకు విలువ లేనట్టే అవుతుంది. పాపం.. మిథున్ రెడ్డి జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం తన ఆత్మ గౌరవాన్ని పక్కన పెట్టి ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయాల్సి వస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles