ఆ కేసులో దొరికిపోతానని పీఎస్సార్ కు భయమేమో!

Saturday, January 10, 2026

పీఎస్సార్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి. కొన్ని వందల వేల రకాల నేరాలన, నేర ప్రణాళికలను, వ్యూహాలను ఆయన చాలా దగ్గరినుంచి పరిశీలించి ఉంటారు. ఎలాంటి నేరాల్లో నిందితులు సులువుగా పట్టుబడిపోతున్నారు. ఎలాంటి నేరాల్లో పట్టుబడడంలేదు. పట్టుబడకపోవడానికి వారికి సహకరిస్తున్న కారణాలు ఏమిటి అనే విషయాల్లో ఆయనకు లోతైన అవగాహన ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ నిఘావిభాగానికి చీఫ్ గా కూడా చేశారంటే అమోఘమైన తెలివితేటలు ఉంటాయని కూడా నమ్మవచ్చు.  అలాంటి పీఎస్సార్ ఆంజనేయులు.. తన మీద నమోదు అయిన కేసుల విషయంలో ఒక్కో కేసు విషయంలో ఒక్కోలా స్పందిస్తోంటే.. మనకు రకరకాల అనుమానాలు కలుగుతాయి. ఒక కేసులో అసలు ముందస్తు బెయిలు పిటిషన్ కోసం కూడా ప్రయత్నించకుండా.. మరో కేసులో ఏకంగా ఆ కేసునే పూర్తిగా కొట్టేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నారంటే.. ఆశ్చర్యమే! చూడబోతే ఆ కేసు ఆయనను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించేలా చేసి వేధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పుడు నిందితుడిగా పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో నిందితులైన మరో ఇద్దరు ఐపిఎస్ లు ముందస్తు బెయిలు తెచ్చుకుని విచారణకు హాజరయ్యారు. కానీ.. పీఎస్సార్ మాత్రం కనీసం బెయిలు ప్రయత్నం కూడా చేయలేదు. చక్కగా అరెస్టు అయి, జైలుకు వెళ్లి, ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. విచారణలో ఏం అడిగినా ఆ కేసుకు నాకు సంబంధం లేదు. సంబంధం లేదు, తెలియదు అన్నాక నన్ను మిగతా ప్రశ్నలు ఎలా అడుగుతారు మీరు? అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగుతున్నారు. కాదంబరి కేసులో ఇలా నడుస్తుండగా.. ప్రస్తుత డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు మీద గతంలో పోలీసు కస్టడీలో హత్యాయత్నం జరిగిందనే కేసులో కూడా పీఎస్సార్ ఆంజనేయులు నిందితుడు. గుంటూరు నగరంపాలెం స్టేషనులో తనమీద నమోదు చేసిన ఈ కేసును కొట్టేయాలంటూ పీఎస్సార్ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. కాదంబరి జత్వానీ కేసులో పోలీసులు అరెస్టు చేయడానికి వస్తున్నారని వారం ముందే తెలిసినా కనీసం ముందస్తు బెయిలుకోసం కూడా ప్రయత్నించని వ్యక్తి, రఘురామకు చిత్రహింసల కేసులో ఏకంగా కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించడం వెనుక మతలబు ఏమిటి? కాదంబరి కేసులో తన చేతులకు మట్టి అంటకుండా తప్పించుకున్నంత ఈజీగా, రఘురామ చిత్రహింసల కేసులో తాను తప్పించుకోజాలనని, అక్కడ విచారణ జరిగితే.. ఇరుక్కుపోతానని ఆయన భయపడుతున్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే అక్కడ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని.. కాదంబరి కంటె రఘురామ కేసు బలమైనదనే భయంతో ఉన్నారని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles