జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా వారి ఎన్నెన్ని రకాల ఆర్థిక అరాచకాలకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటే ప్రజలు విస్తుపోతున్నారు. ఇప్పటికే పలు రంగాల ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసి, గత ప్రభుత్వం ఎన్ని రకాల దోపిడీకి పాల్పడినదో.. అందులో కొంతమేర ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే లిక్కర్ దందాల రూపంలో ఒక స్థాయి అవినీతికి పాల్పడినట్లుగా చంద్రబాబు నాయుడు అంచనా వేస్తే, ఆ మొత్తం తప్పు అని 50 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని బిజెపి మరియు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇసుక అక్రమ వ్యాపారాలతో 20 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా దండుకున్నట్టుగా కూడా మంత్రులు ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీ ఫైబర్ నెట్ రూపంలో సాగించిన దందాతో కేవలం ఒకటిన్నర ఏడాదిలో 240 కోట్ల రూపాయల మేర స్వాహా చేసినట్టుగా వార్త లు వస్తున్నాయి.
తమాషా ఏమిటంటే ఏకంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లోనే ఈ దందాకు ఒక రాజమార్గాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ కలిగి ఉన్న వినియోగదారుల నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేసినప్పుడు, రికార్డుల్లో లేని వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ఆటోమేటిగ్గా ఆ యాప్ ద్వారా ముంబైలోని మరొక బ్యాంకు అకౌంట్ కు మళ్ళించేలా ప్రోగ్రామింగ్ రూపొందించడం గమనార్హం. మొత్తం వినియోగదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయినట్లుగా చూపించి, మొత్తం అందరి నుంచి వసూళ్లను మాత్రం కొనసాగించడం ద్వారా సగానికి పైగా సొమ్ము దారి మళ్ళించారనేది ఆరోపణ. ఈ రూపంలో 17 నెలల వ్యవధిలో నెలకు 14 కోట్ల రూపాయల వంతున దాదాపుగా 238 కోట్ల సొమ్ము స్వాహా అయినట్లుగా వెలుగు చూస్తోంది.
ఈ అక్రమాలపర్వంపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ స్వాహా పర్వం మొత్తం కొనసాగినట్లుగా వినవస్తుంది. మరి ఇంత భారీ మొత్తాన్ని దిగమించడం వెనుక ఇంకా ఎవరెవరు వైసీపీ పెద్దలు ఉన్నారో విచారణలో తేలాలి.
ప్రోగ్రామింగ్‌లోనే మతలబు: వసూళ్లు డైరక్టుగా లూటీ!
Wednesday, January 22, 2025