వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిన మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీనాధ్ ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి.. రెండు కోట్ల రూపాయల ముడుపులు, ముక్కు పిండి వసూలు చేశారు విడదల రజని. ఆ సొమ్మును పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది ఇంట్లో ఇవ్వాల్సిందిగా క్రషర్స్ యజమానులను ఆదేశించారు. ఆ రకంగా కేవలం వదినమ్మ పురమాయించి పంపిన రెండు కోట్ల రూపాయలను తన చేతుల మీదుగా పుచ్చుకున్నందుకు.. ఏదో ఆ సేవ చేసినందుకు క్రషర్స్ యజమానులనుంచి అదనంగా మరో పదిలక్షలు తన సొంతానికి పుచ్చుకున్నందుకు, మధ్యవర్తిత్వం వహించిన ఐపీఎస్ అధికారి జాషువాకు మరో పదిలక్షలు ఇప్పించినందుకు మాత్రమే గోపీనాథ్ అరెస్టు అయ్యారేమో.. పెద్దవాటా వదినమ్మది అయితే.. పాపం.. ముందు మరిదిగారు అరెస్టు కావాల్సి వచ్చిందే.. అని ప్రజల్లో ఎవరైనా సానుభూతి కలిగి ఉంటేగనుక.. వారి అభిప్రాయం మార్చుకోవాల్సిందే. గోపీనాథ్ అరెస్టు తర్వాత వెలుగులోకి వస్తున్న వాస్తవాలను గమనిస్తూ ఉంటే.. ఎవ్వరైనా సరే నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి. చిలకలూరిపేటలో గత అయిదేళ్లపాటు పేరుకే విడదల రజని ఎమ్మెల్యే.. అసలు సిసలు దందాలు నడిపించిన షాడో ఎమ్మెల్యే మరిదిగారే అనే ప్రచారం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. పది రూపాయలు కళ్లజూడగలిగే ఏ ఒక్కదందాను కూడా విడిచిపెట్టకుండా.. చివరికి పేదరైతులు, చిరువ్యాపారులు వ్యాపారం చేసుకునే సంత నిర్వాహకుల నుంచి కూడా దందాలు వసూలుచేశారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నియోజకవర్గంలో ఆయన దందాల చిట్టా చాలా చాలా పెద్దదిగానే ఉంది. ప్రచారంలోకి వస్తున్న వివిధ సమాచారాన్ని బట్టి వివరాలు ఇలా ఉన్నాయి..
* నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమవ్యాపారాలనుంచి నెలకు రూ.పది లక్షలు నిలకడగా దందా వసూలు చేసేవారు
* రిజిస్ట్రారు కార్యాలయంలో ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా సరే.. ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతోపాటు 3 శాతం అదనంగా విడదల మరిదికి చెల్లించాలి.
* అపార్ట్ మెంట్స్ నిర్మిస్తే ఒక్కో ఫ్లాట్ కు 5 లక్షల వంతున కప్పం కట్టాలి. కట్టకపోతే.. రకరకాల కొర్రీలతో నిర్మాణాలను నిలుపుదల చేయిస్తారు.
* బాపట్ల నుంచి చిలకలూరిపేట మీదుగా వెళ్లే గ్రానైట్ లారీలు ఒక్కొక్కటి పదేసి వేల రూపాయలు టోల్ ఫీజు.. మరిదిగారికి చెల్లించుకోవాలి.
* ప్రతి శనివారం పేటలో జరిగే సంత నిర్వాహకులు వాటాలు ఇవ్వాలి
* జగనన్న కాలనీల ముసుగులో మార్కెట్ ధరకంటె ప్రభుత్వం కొనుగోలు చేసే ధరలను భారీగా పెంచేసి అమ్మిన రైతులనుంచి ఒక్కో ఎకరాకు 2 నుంచి 7.5 లక్షల వరకు ముడుపులు స్వీకరించారు.
* మట్టి, ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ట్రిప్పుకూ సొమ్ము కట్టాల్సిందే.
* ఇక మద్యం సిండికేట్లు, బార్లు వ్యవహారం చెప్పే అవసరమే లేదు.
ఇన్ని రకాల దందాలు సాగించడంలో గోపి ఆరితేరిపోయాకరని.. ఒకదశలో ఆయన మీద మంత్రి అయిన తర్వాత విడదల రజనికి కూడా నియంత్రణ లేనంతగా ఆయన దందాలు మితిమీరాయని కూడా పుకార్లు స్థానికంగా వినిపిస్తున్నాయి. మరి క్రషర్స్ యజమానుల నుంచి రెండు కోట్లు ఎమ్మెల్యే పిండుకున్న వ్యవహారంలో తర్వాత దశ చర్యలు ఎప్పటికి ఉంటాయోనని జనం వేచిచూస్తున్నారు.
