ఫైబర్ నెట్ ముసుగులో ఎన్నెన్నో దందాలు!

Sunday, January 26, 2025

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో కొన్ని వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయి. ఆయా విభాగాలలో ఏ చిన్న లోపం జరిగినా ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అర్థమైపోతుంది. తప్పులు జరుగుతూ ఉంటే ప్రజలు సులభంగా వాటిని గ్రహించగలుగుతారు. కానీ అదే ప్రభుత్వంలో కొన్ని విభాగాలు ఉంటాయి. వాటి గురించి ప్రజలకే తెలియదు. ఆయా విభాగాల ముసుగులో ఎన్ని దోపిడీలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు జరిగినా సరే తక్షణం ప్రజల దృష్టికి వెళ్లడం అనేది అసాధ్యం. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏపీ ఫైబర్ నెట్ అనే విభాగాన్ని ఆయన ఆ రకంగా రహస్య దోపిడీకి నిలయమైన అడ్డాగా మార్చేశారు. ఫైబర్ నెట్ అనే ఒకే ఒక్క ముసుగు కింద ఎన్ని రకాల దోపిడీలు జరిగాయో ఇప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.

మొన్నటికి మొన్న వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ కి అధికారికంగా ఫైబర్ నెట్ ద్వారా చెల్లించవలసిన మొత్తం 20 లక్షలకు మించి లేకపోయినప్పటికీ.. 2.15 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచిపెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఆయన నుంచి తిరిగి వసూలు చేయడానికి ఆల్రెడీ నోటీసులు పంపారు. నోటీసులకు స్పందించి అదనంగా తీసుకున్న డబ్బు చెల్లించకపోతే గనుక తదుపరి చర్యలు ఉంటాయని ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి హెచ్చరిస్తూనే ఉన్నారు. మరొకవైపు ఫైబర్ నెట్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తొత్తులకు తైనాతీలకు, అనుచరులకు కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో ఎలాగైతే కోట్లకు కోట్ల రూపాయలు దోచి పెట్టారో కూడా వెలుగులోకి వస్తున్నది. వందల కొద్ది ఉద్యోగాలను అడ్డదారుల్లో సృష్టించి కేవలం వాట్సాప్ మెసేజ్ ల ద్వారానే ఉద్యోగాలు ఇచ్చేసి.. కనీసం నియామక పత్రాలు కూడా లేకుండా వారికి సంవత్సరాల తరబడి లక్షల రూపాయల వంతున వేతనాలు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సొంతం. ఇలా అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన 410 మందిని ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నట్లుగా చైర్మన్ జీవి రెడ్డి ప్రకటించారు.

వైసిపి కోసం జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం అసభ్య పోస్టులు పెట్టేవారికి, సాక్షిలో చిన్న జీతాలకు ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఫైబర్ నెట్ లో లక్షల జీతాలతో ఉద్యోగాలు కట్టబెట్టారు. వందల మంది ఇలా అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందగా అసలు వారు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదని జీవి రెడ్డి అంటున్నారు.

ఫైబర్ నెట్ అనేది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడుకున్న ఒక ముసుగు. డిజిటల్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ విభాగాలలో వందల వేల మందికి అడ్డదారుల్లో దోచి పెట్టారు. వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే సైకోలకు ఈ విభాగాలలో ఉద్యోగాల పేరుతో ఉపాధి కల్పించారు. ఇలాంటి అరాచకాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి 410 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఇంకా రెండు వందల మంది దాకా ఇలాంటి వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దందాలు అన్నిటికీ ఇప్పుడు చెక్ పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles