ఒక సాధారణమైన ప్రభుత్వ ఉద్యోగి.. తన ప్రమేయం లేకుండా జరిగిన వ్యవహారాలకు తనమీద కూడా కేసు నమోదు అయితే.. ఏం చేస్తారు? విచారణ సందర్భంగా తనకు తెలిసిన వాస్తవాలేమిటో బయటకు చెప్పేస్తారు. అంటే, తన మీద ఎవరి ఒత్తిడి వలన అలా తప్పు చేయాల్సి వచ్చిందో ఒప్పేసుకుంటారు. అలా కాకుండా, అసలు విచారణకే హాజరు కాకుండా నెలలతరబడి తప్పించుకు తిరుగుతూ.. గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే ఖరీదైన లాయర్లను నియమించుకుని సుప్రీం కోర్టులో పిటిషన్లు నడిపేవరకు సాగదీస్తారా? సాహసిస్తారా? అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. కానీ.. గుంటూరు జీజీహెచ్ కు గతంలో సూపరింటెండెంట్ ప్రభావతి విషయంలో అదే జరుగుతోంది. కోర్టు నుంచి బెయిలు దక్కక నిరాశపడిన ప్రభావతి ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గనుక.. నోరు విప్పి వాస్తవాలు చెప్పేస్తే వైసీపీ లోని అనేకమంది పెద్దతలకాయల బాగోతాలు ఇరుక్కుంటాయని పలువురు నేతలు అంచనా వేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రఘురామక్రిష్ణ రాజును జగన్ తాను సీఎంగా ఉండగా టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను రాజద్రోహం, కుట్ర కేసుల్లో అరెస్టు చేయించి.. పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయించారు. పోలీసు కస్టడీలో విచారణ సందర్భంగా తనమీద హత్యాప్రయత్నం జరిగిందని అప్పటినుంచి కూడా రఘురామ పోలీసు కేసు పెట్టి పోరాటం చేస్తున్నారు. జగన్ సర్కారు ఉన్న రోజుల్లో ఆయన ఫిర్యాదులకు అతీగతీ లేకుండాపోయింది గానీ.. ఇప్పుడు పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆయనను చిత్రహింసలు పెట్టినప్పుడు.. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి.. ఆయనకున్న గాయాలు, ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ ఆమె మీద కూడా ఆయన కేసు పెట్టారు. ఇన్నాళ్లూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగిన ఆమె ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ నడిపారు. అయితే విచారణకు సహకరించే కండిషన్ మీద ఆమెకు అరెస్టునుంచి భద్రత కల్పించిన సుప్రీం బెయిలు మాత్రం ఇవ్వలేదు. ఇన్నాళ్ల తర్వాత.. డాక్టర్ ప్రభావతి.. సోమ, మంగళ వారాల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు.
ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభావతి నోరు విప్పి వాస్తవాలు చెబితే.. ఈ ఇతర నిందితులతో పాటు మరికొందరు వైసీపీ పెద్దలు కూడా కేసులో ఇరుక్కుంటారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి డాక్టర్ ప్రభావతికి అవకాశం కూడా తక్కువని అంటున్నారు. మరి రెండు రోజుల పోలీసు విచారణకు ఆమె ఎంత మేర సహకరిస్తుందో.. లేదా ఆమె కూడా, రాజకీయ నాయకుల్లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి జవాబులతో బుకాయించాలని చూస్తుందో వేచిచూడాలి.
ప్రభావతి నోరు విప్పితే చాలా మందికి ఇబ్బందే!
Saturday, April 12, 2025
