కిరాయికి మనుషుల్ని తీసుకువచ్చి వాళ్లను రైతుల్లాగా భ్రమింపజేయడం.. కిరాయి మనుషులతో తమ చానెల్ కెమెరాల ముందు చంద్రబాబును తిట్టించడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంకరబుద్ధుల్లో ఇలాంటివన్నీ కూడా పాతబడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. తోతాపురి మామిడి రైతులను పరామర్శిస్తా.. అనే టైటిల్ తో జగన్మోహన్ రెడ్డి నడిపించిన డ్రామాను రక్తి కట్టించడానికి ఆ పార్టీ నాయకులు ఈసారి కొత్త ఎత్తుగడలు కూడా వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన వారు రైతులనుంచి మామిడికాయలు కొని.. వాటిని అయిదు ట్రాక్టర్లలో తరలించి.. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుండగా.. దానికి ముందు రోడ్లమీద పోయించి అల్లరి చేయడానికి ప్రయత్నించారు. జరుగుతున్న రభస చూసి పోలీసులు సదరు ట్రాక్టరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ఆరా తీయడంతో ఈ కుట్ర డ్రామా మొత్తం బయటపడింది.
చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడిరైతుల్ని పరామర్శించడానికి జగన్ బుధవారం వెళ్లారు. ఆయన పరామర్శ యాత్రం మొత్తం చాలా గందరగోళంగా నడిచింది. పోలీసుల జాగ్రత్తలను, నిబంధనలను ఉల్లంఘించడమే లక్ష్యంగా జగన్ యాత్ర సాగింది. వేలమంది జనాన్ని పోగేశారు. వాళ్లంతా తాగి రోడ్ల మీద చిందులు తొక్కుతూ జగన్ వాహనం మీదికి ఎగబడుతూ నానా బీభత్సం సృష్టించారు. పోలీసులమీదనే దాదాపుగా దాడిచేసి.. పార్టీ కార్యకర్తలంతా బంగారుపాళెం మార్కెట్ యార్డులోకి చొచ్చుకుపోయారు.
ఒక పత్రిక ఫోటోగ్రాఫర్ మీద దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టారు. కెమెరాను లాక్కుని ఫోటోలను కార్డును పీక్కున్నారు. ఇన్ని చేస్తూ.. అదనంగా.. రోడ్లమీద తోతాపురి మామిడికాయలు ట్రాక్టర్లతో పోయించి ఒక డ్రామా క్రియేట్ చేయాలని అనుకున్నారు. జగన్ కాన్వాయ్ వస్తుండగా అయిదు ట్రాక్టర్లతో ఆ పని కూడా చేశారు. అయితే వారి కుట్ర కాస్త వికటించింది.
ఇద్దరు ట్రాక్టరు డ్రైవర్లు పోలీసులకు దొరికిపోయారు. ఎందుకిలాంటి పనిచేశారని అడిగినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన దేవేంద్ర అనే లాయరు.. పొరుగు గ్రామంలోని మామిడి తోట వద్ద కాయలు కొని లోడ్ చేయించి.. తమతో తీసుకువచ్చారని.. తాను చెప్పినప్పుడు రోడ్డు మీద పోయాలని చెప్పి పోయించారని వారు పోలీసులకు వెల్లడించారు.
ఇలాంటి పని చేయడం వెనుక గలీజు కుట్ర బయటపడిపోయింది. సాధారణంగా కోతకూలీలు కూడా గిట్టుబాటు కాని.. ఘోరమైన దరలు ఉన్నప్పుడు.. రైతులు దిగుబడిని రోడ్ల మీద పోసేయడం కొత్త విషయం కాదు. కానీ ఎక్కువగా టమోటా విషయంలోనే ఇలా జరుగుతుంటుంది. తోతాపురి మామిడికి ప్రస్తుతం గిట్టుబాటు అవుతున్న ధర తక్కువేం కాదు. అందుకు దిగుబడి పెరగడం, డిమాండ్ తగ్గడం కూడా కారణం. కానీ.. రోడ్ల మీద పోసేంత లేదు. వైసీపీ వారే కుట్రలు చేసి.. వీడియోలు తీసి తమ చానెళ్లలో అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇలాంటి కుట్రలు చేసినట్టుగా బయటపడింది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
