వైయస్ జగన్మోహన్ రెడ్డి టీం లో అసలు మంచోడు కానిది ఎవ్వరు? ఆయన ఎన్నికల బరిలో నిల్చోబెట్టిన 199 మందిలో అందరూ మంచోళ్ళే. 200వ వ్యక్తిగా ఆయనతో సహా! ప్రతి ఊరిలోనూ ఎన్నికల సభ నిర్వహించినప్పుడు ప్రతి అభ్యర్థిని పరిచయం చేసి, ‘మంచోడు’ అనే మొదటి పదంతోనే వారిని పొగిడాడు జగనన్న.
కానీ ఆయనకు అర్థం కాని సంగతేందంటే- ఆయన మంచోడు అంటూ ఇచ్చే సర్టిఫికెట్ కు కాలం చెల్లింది! ఆయన సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయింది. ఆయన ధ్రువీకరణను ప్రజలు నమ్మడం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు నమ్ముతారు?
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిన ఘటన మీద వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
ఈ అగ్ని ప్రమాదం వెనుక ప్లానింగ్ లో సూత్రధారులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున రెడ్డి ఉన్నట్లుగా వారిపై నిందలు వేస్తూ అభాసుపాలు చేస్తున్నారని, పాపం జగన్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వీరి కోసం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరూ చాలా మంచోళ్ళని, కాబట్టే నియోజకవర్గం ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారని జగన్ రెడ్డి కితాబు ఇచ్చారు.
నిజానికి జగన్ రెడ్డి ఇచ్చిన కితాబులకు విలువలేదు.
ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. మంచోళ్ళు కాబట్టి గెలిపిస్తున్నారని జగన్ అంటున్నారు గానీ ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం ‘మేము అసలు గెలిపించడం లేదు’ అని మొత్తుకుంటున్నారు. ‘వాళ్ళే దొంగ ఓట్లు వేయించుకుని గెలుస్తున్నారని ఆరోపిస్తున్నారు’ తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి ఎదురైన ప్రజల ప్రతిఘటన కూడా అదే! ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ లేదని తెలుసుకోవాలి.
ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టి ఎరగని జగన్, ఇప్పుడు పెద్దిరెడ్డి తండ్రీకొడుకుల పాత్ర గురించి ప్రజల్లో అనుమానాలు పుడుతుండగా ఇంత ప్రేమగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో అర్థం కావడం లేదు.