మద్యంకుంభకోణంలో.. మూడున్నర వేల కోట్ల రూపాయలను డిస్టిలరీలనుంచి వసూలు చేసిన నెట్ వర్క్ ను నడిపించడం ద్వారా.. కింగ్ పిన్ రాజ్ కెసిరెడ్డి.. తన తెలివితేటలను చాలాబాగా నిరూపించుకుని ఉండవచ్చు గాక. కానీ ఒక విషయంలో మాత్రం ఆయనకంటె తెలివిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన దోపిడీపర్వాన్ని నడిపించినట్టుగా కనిపిస్తోంది. దోచేసిన డబ్బులను బిగ్ బాస్ కు, ముఖ్యనేతకు వాటాలు చెల్లించేయగా మిగిలిన డబ్బులను ఎలా ఖర్చు చేయాలి.. లేదా, ఎలా దాచుకోవాలి అనే విషయంలో రాజ్ కెసిరెడ్డి తెలివితేటల కంటె అనిల్ కుమార్ యాదవ్ తెలివితేటలే మెరుగైనవిగా తేలుతున్నాయి. నెల్లూరు క్వార్ట్జ్ అక్రమతవ్వకాలు, విక్రయాల్లో దందాలకు సంబంధించిన కేసులో.. అనిల్ కుమార్ యాదవ్.. ఇక్కడ నెల్లూరులో దోచుకున్న సొమ్ములను ఆఫ్రికా దేశంలో మైనింగ్ వ్యాపారంలో గనుల తవ్వకాల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలుతోంది.
రాజ్ కెసిరెడ్డి.. మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న సొమ్ములను తన వాటాగా దక్కించుకున్న సొమ్ములను స్థానికంగానే రకరకాల రూపాల్లో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాదులోని వివిధ ఆస్పత్రుల్లో పెట్టుబడి పెట్టారు. సినిమాలు తీశారు. హడావుడి చేశారు. ఆయనకు ఒక్కసారిగా ఇంత భారీగా సొమ్ములు ఎలా వచ్చాయనే గుసగుసలు కూడా అప్పటినుంచి ఉన్నాయి. అలాంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా రాజ్ కెసిరెడ్డి.. అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు.
కానీ అనిల్ కుమార్ యాదవ్ అంతకంటె తెలివైన వ్యక్తి. నెల్లూరుక్వార్ట్జ్ లో తాను దోచుకున్నది ఆఫ్రికాదేశంలో గ్రాఫైట్ మైనింగ్ లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ బాగోతాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి.
చైనాలో క్వార్ట్జ్ కు మంచి ధర పలికినంత కాలం నెల్లూరులో అనిల్ బ్యాచ్ విచ్చలవిడిగా తవ్వకాలు జరిపించి దోచుకున్నారు. అనుమతులు ఉన్నవారినుంచి కూడా వసూళ్లు చేశారు. అనుమతులే లేనిచోట్ల కూడా తవ్వించారు. లీజులు ముగిసన మైన్స్ లోనూ తవ్వించారు మొత్తంగా ఎడాపెడా క్వార్ట్జ్ తవ్వకాలు చేయించి.. రవాణా అయ్యే ఒక్కో టన్నుకు 7వేల నుంచి 10 వేలవరకు దందా వసూలు చేశారు. అలా వచ్చిన సొమ్ములో నెలకు 20 కోట్ల వరకు బిగ్ బాస్ ముఖ్యనేతకు అనిల్ కుమార్ యాదవ్ పీఏ నాగరాజు పంపేవారని తెలుస్తోంది.
వీటితోపాటు అనిల్ కుమార్ నెల్లూరు గూడూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లువేశారు. హైదరాబాదులో కూడా మణికొండ తుర్కయాంజిల్ లలో విల్లాల ప్రాజెక్టులు చేపట్టారు. ఇవన్నీకాగా.. ఆఫ్రికాఖండంలోని ఐవరీకోస్ట్ దేశంలో గ్రాఫైట్ మైనింగ్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు పీఏల్లో ఒకరైన నాగరాజు స్థానికంగా వసూళ్లు ముఖ్యనేతకు చెల్లింపులు చూసుకోగా, మరో పీఏ రాజీవ్ రెడ్డి ఆఫ్రికా పెట్టుబడులను చూసుకున్నట్టుగా సమాచారం.
అయితే అనిల్ ముఠాలోని అనేక మంది నిందితులు ఇప్పుడు దుబాయికి పారిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు తీవ్రం అవుతున్న సంగతి గుర్తించిన వెంటనే ఎక్కడివారు అక్కడ మాయమయ్యారు. ఇలా పరారైన వారిలో అనిల్ స్నేహితుడు కోడూరు దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి, దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి, సాముద్దీన్ లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకాస్త లోతుగా విచారణ సాగితే.. ఇంకెన్ని వివరాలు వెలుగుచూస్తాయోనని పోలీసులు నిర్ఘాంతపోతున్నారు.
నెల్లూరులో దోచేసి.. ఆఫ్రికాలో పెట్టుబడులు!
Wednesday, December 10, 2025
