విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. ఇదేమీ మేనిఫెస్టోలో చెప్పిన మాట కాదు. కానీ.. మేనిఫెస్టో హామీలకంటె చాలా విలువైనది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి కొత్త దశ దిశ నిర్దేశించేది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో నమ్మకాన్ని పెంచేది. అంతేకాదు.. సంపన్నులు అయినా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలనే ప్రేరణ కలిగించేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూలులో మంత్రి నారాయణ ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అద్భుతంగా తీర్చిదిద్దిన సంగతి అందరికీ తెలిసిందే. డిజిటల్ స్కూలుగా తీర్చిదిద్దిన తర్వాత.. ఎడ్మిషన్లకు నోవేకన్సీ బోర్డు పెట్టే స్థాయిలో విద్యార్థులు ఇక్కడ చేరడం జరిగింది. అయితే ఈ స్కూలు పునఃప్రారంభానికి హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గానికి ఒక ఉన్నతపాఠశాలను ఈ స్థాయిలో తీర్చిదిద్దుతాం అని ప్రకటించడం చాలా గొప్ప విషయం.
వీఆర్ (వెంకటగిరి రాజా) మునిసిపల్ హైస్కూలును, అదే పాఠశాలలో చదువుకున్న మంత్రి నారాయణ తన సొంత డబ్బు వెచ్చించి, అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ రకంగా ఎన్నికల ముందు ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని లోకేష్ ప్రశంసించారు. అధికారుల వెంటబడి మరీ ఈ పాఠశాలకు తిరిగి అనుమతులు సాధించుకున్నారని అన్నారు. దేశంలోనే ఇది ఆదర్శ పాఠశాలగా నిలుస్తుందని ప్రశంసించిన లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలోని నిడమర్రు పాఠశాలను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతున్నదని వెల్లడించారు. ఇదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పాఠశాల వంతున.. రాష్ట్రంలో 175 పాఠశాలలు అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పడం.. ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి కొత్త బూస్ట్ వంటిదని చెప్పాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన టీచర్లు, ఉన్నత విద్యావంతులు అయిన టీచర్లు ఉంటున్నప్పటికీ కూడా.. ప్రజలు ఎక్కువగా ప్రెవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నప్పటికీ.. ఆదరణ పెరగడం లేదు. ఇలాంటి సవాళ్లకు సమాధానం అన్నట్టుగా నెల్లూరులోని వీఆర్ హైస్కూలు నిలుస్తోంది. ప్రజలు ఎగబడి తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించే స్థాయికి అది అభివృద్ధి చెందింది. అయితే ఇలాంటి మంచి ప్రయత్నం ఒక్క నెల్లూరులో జరగగా రాష్ట్రమంతా మురిసిపోయే పరిస్థితి కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కూలును ఈ స్థాయికి అభివృద్ధి చేయాలని నారా లోకేష్ సంకల్పించడం చాలా గొప్పవిషయం అని ప్రశంసలు వస్తున్నాయి. ఇవన్నీ మేనిఫెస్టోలో కనిపించేవి కాదని, కానీ.. అంతకు మించి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సత్కార్యాలని ప్రజలు అంటున్నారు. ఈ అయిదేళ్ల వ్యవధిలోనే లోకేష్ ఈ ఆదర్శ విద్యా యజ్ఞాన్ని పూర్తిచేయాలని కూడా కోరుకుంటున్నారు.
కొత్త ఆశలు పుట్టిస్తున్న లోకేష్ మాటలు!
Monday, December 8, 2025
