వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వారు రాష్ట్రంలో ఏ కారణంగా చనిపోయినా సరే.. రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, చంద్రబాబు సర్కారును రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని గోల చేసే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కిమ్మనడం లేదు. పుంగనూరులో వైసీపీ గూండాలూ.. కత్తులతో తెగబడి తండ్రీకొడుకుల్ని నరికేస్తే.. తండ్రి చనిపోయాడు, కొడుకు ప్రాణాపాయంతో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్మార్గాల గురించి జగన్ దళాలు నోరు విప్పడం లేదు. కాగా.. వారి హత్యారాజకీయాల తీరు మీద మంత్రి నారా లోకేష్ మాత్రం చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఆయన అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క పుట్టుకనే ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అనేది ఒక శవం దగ్గర పుట్టిన పార్టీ.. మరో శవంతో అధికారంలోకి వచ్చిన పార్టీ అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు. ఆయన మాటలు అక్షరసత్యాలు గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు.. ఆయన శవానికి ఇంకా అంతిమ సంస్కారాలు కూడా జరగకముందే.. ఎమ్మెల్యేలు అందరితోనూ సంతకాలు సేకరింపజేసి.. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు పంపిన స్వార్థపూరిత చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సోనియాగాంధీ ముందు ఆయన పప్పులేమీ ఉడక్కపోయే సరికి.. తండ్రి చావు ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ లాగా.. జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు.
అయినా సరే ప్రజలు ఆదరించలేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మీదనే విశ్వాసం చూపించారు. అయితే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే.. తన చిన్నాన్న చంపేశారంటూ మొసలి కన్నీరు కారుస్తూ.. ఆ చావునుంచి ప్రజల సానుభూతిని పిండుకుంటూ.. 2019 ఎన్నికల్లో అధికారం గద్దె ఎక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలను నారా లోకేష్ తన ఘాటు విమర్శల ద్వారా ప్రజలకు గుర్తుచేస్తున్నారు.
ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో హత్యారాజకీయాలకు గానీ, పారదర్శక నిజాయితీగల రాజకీయాలకు చోటెలా ఉంటుంది.. అనేదే ప్రజల సందేహం. కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజంటుగా కూర్చున్నాడనే కక్షతో.. తమ అక్రమాలకు, రిగ్గింగులకు అడ్డుపడ్డాడనే కక్షతో రామక్రిష్ణను పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు హత్యచేసిన వైనం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం అవుతోంది. వైసీపీ రక్తచరిత్ర కారణంగా, తెలుగుదేశం తమ సైనికుడిని కోల్పోవడం బాధాకరం అని లోకేష్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
శవరాజకీయాలపై లోకేష్ స్ట్రాంగెస్ట్ కౌంటర్!
Monday, December 8, 2025
