కొత్త ట్రెండ్ తో సాగనున్న లోకేష్ టూర్స్!

Friday, December 5, 2025

తెలుగుదేశం పార్టీ నిర్వహణలో సరికొత్త ట్రెండ్స్ ను కార్యచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు నారా లోకేష్. పార్టీ కార్యకర్తలకు బీమా వంటి సదుపాయాలు కల్పించడంతో కొత్త కొత్త పద్ధతులను ఆయన కార్యచరణలోకి తీసుకువచ్చారు. కార్యకర్తలకు అండగా ఉండడం, కార్యకర్తల పిల్లలకు ఉచితంగా విద్యాబుద్ధులు చెప్పించడం, వారిని అవసరాల్లో ఆదుకోవడం ఇలాంటి మంచి పనులన్నీ గాలివాటుగా సిఫారసుల ప్రకారం జరిగే వ్యవహారాలుగా కాకుండా, వ్యవస్థీకృతంగా అందరికీ సమానంగా అలాంటి ప్రయోజనాలు అందేలా.. తెలుగుదేశం పార్టీ ఎడ్మినిస్ట్రేషన్ సెటప్ ను సిద్ధం చేసిన వ్యక్తి నారా లోకేష్. అలాంటి నాయకుడు ఇప్పుడు ఏపీలో కీలక మంత్రిగా కూడా ఉన్నారు. అయితే.. ఇక మీదట తాను మంత్రిగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించే సందర్భాల్లో కూడా పార్టీకోసం నిర్దిష్టమైన ప్రణాళికతో సాగనున్నట్టుగా లోకేష్ ప్రకటిస్తున్నారు.

ఇకమీదట నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ పర్యటిస్తున్నా సరే.. అక్కడి నాయకులతో, పార్టీ కార్యకర్తలతో ముందుగా సమావేశం నిర్వహిస్తానని నారా లోకేష్ అంటున్నారు. నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం కార్యకర్తలతో జరిగే సమావేశంలో వారి కష్టనష్టాలను తెలుసుకుని, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను కూడా ఆకళింపు చేసుకుని.. వారి సమస్యలు పరిష్కరించిన తర్వాతనే.. తతిమ్మా రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటానని ఆయన అంటున్నారు.

ఆచరణలో కూడా అనుకున్నట్టుగా చేయగలిగితే.. లోకేష్ మాటలు ఎంతో గొప్ప ఫలితాన్ని సాధిస్తాయి. సాధారణంగా పార్టీల అగ్రనాయకులు అధికారంలో లేనప్పుడు సామాన్య కార్యకర్తలకు కూడా అపాయింట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీ కార్యకర్తల కోసం వెచ్చించడానికి తమ వద్ద సమయం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. వారు అపాయింట్మెంట్ కోరినా సరే.. ఎమ్మెల్యే ద్వారా రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. కానీ.. నారా లోకేష్ మాత్రం.. పార్టీ నిర్వహణలో తన ముద్రను చూపించదలచుకుంటున్నారు. ప్రత్యేకించి నియోజకవర్గ స్థాయి పర్యటనలు జరుగుతున్నప్పుడే.. అక్కడి కార్యకర్తలతో ముందుగా సమావేశం పెట్టుకుని, వారితో చర్చించి, వారి సమస్యలను ఆలకించిన తర్వాతనే మిగిలిన యాత్ర సాగుతుందని ప్రకటించడం గొప్ప సంగతి. ఇలాంటి పని.. కార్యకర్తల్లో పార్టీ పట్ల అభిమానాన్ని అమాంతం పెంచుతుంది. పార్టీలో తమకు అనల్ప ప్రాధాన్యం ఉన్నదనే విశ్వాసాన్ని వారిలో పాదుగొల్పుతుంది. ఆ దిశగా లోకేష్ తాజా నిర్ణయం మెరుగైనది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles