ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. క్రియాశీలమైన, రాష్ట్రం కోసం తపన పడే ఒక మంత్రి కేంద్రం వద్దకు వెళితే.. ఎంత చురుగ్గా ఉండాలో.. ఎంత నిరంతరాయంగా తన షెడ్యూలును ప్లాన్ చేసుకోవాలో.. రాష్ట్రం కోసం నిధులు, పథకాలు, ప్రాజెక్టులు సాధించడానికి పరిస్థితుల్ని సానుకూలం చేసుకోవడానికి ఎందరెందరిని కలవాలో.. అనే విషయాల్లో తానే ఒక రోల్ మాడల్ గా సెట్ చేసేలాగా.. నారా లోకేష్ చాలా బిజీ టూర్ షెడ్యూలుతో ఢిల్లీలో గడుపుతున్నారు. అనేక మంది కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులకోసం అడుగుతున్నారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాగించిన హస్తిన యాత్రలతో పోల్చి చూసినప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తన ఢిల్లీ యాత్రలో నారా లోకేష్ కేంద్రమంత్రులు జైశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురీ, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, సర్బానంద సోనోవాల్, అశ్వినీ వైష్ణవ్ లతో సమావేశం అయ్యారు. ఒక్కొక్కరి వద్దకు వారి శాఖలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అవసరం ఉన్నదో.. వారు ఎలాంటి ప్రాజెక్టులుమంజూరుచేయాలని తాము కోరుకుంటున్నామో నిర్దిష్టమైన వినతిపత్రాలతో లోకేష్ వారిని కలిశారు. కాబోయే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కూడా నారా లోకేష్ భేటీ కావడం విశేషం.
అయితే ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గతంలోముఖ్యమంత్రి హోదాలో అనేక పర్యాయాలు హస్తిన యాత్ర సాగించేవాళ్లు. అయితే ప్రతిసారి కూడా.. ఆయన కేవలం తన మీద ఉన్న సీబీఐ కేసుల విషయంలో తీవ్రంగా వారు వ్యవహరించకుండా చూడాలని, అలాగే అవినాష్ రెడ్డిని, వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తప్పించేలా కేంద్రంలోని పెద్దలను బతిమాలడానికి మాత్రమే జగన్ వెళుతున్నారంటూ అనేక గుసగుసలు వినిపించేవి. ఢిల్లీలో ఆయన ప్రతి పర్యటన కూడా అంతే అనుమానాస్పదంగా జరిగేది.
కొన్ని సందర్భాల్లో ఆయన కొందరు కేంద్రమంత్రులను కలిసి, మమ అనిపించి, కనీసం ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టకుండా.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగాం, రైల్వేజోన్ అడిగాం అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి మాయ చేస్తుండేవాళ్లు. చాలా సందర్భాల్లో మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్లు కూడా దొరక్క.. రెండు మూడు రోజుల పాటు తన నివాసంలోనే కూర్చుండిపోయి అక్కడినుంచి అటే తిరిగి తాడేపల్లికి వచ్చేశారు కూడా.
ఇలాంటి సందర్భాలను గమనించినప్పుడు.. జగన్ కేవలం తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి, కేసుల నుంచి రక్షణ కోసమే ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళుతున్నట్టుగా జరిగే ప్రచారాన్ని జనం నమ్మేవాళ్లు. ఆయన ఇంత చురుగ్గా కేంద్రమంత్రులను కలవడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం రకరకాల వినతిపత్రాలు సమర్పించడం ప్రజలు ఎన్నడూ చూడలేదు. అందుకే నారా లోకేష్ ఢిల్లీలో సాగిస్తున్న సుడిగాలి పర్యటనను గమనించి.. ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. క్రియాశీల మంత్రి కి నిదర్శనంలాగా లోకేష్ పనిచేస్తున్నారని అంటున్నారు.
