కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పెన్షన్లు పెంచింది. ఎన్నికల ప్రచార సమయంలో వృద్ధుల, వితంతువులకు రూ.నాలుగువేలకు, వికలాంగుల పెన్షన్లను రూ.ఆరు వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రకటించిన ఏప్రిల్ నెల నుంచి అధికారంలోకి రాగానే.. అరియర్స్ సహా ఇస్తానని కూడా మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. అరియర్స్ సహా జూన్ 1న చెల్లించి.. లబ్ధిదారుల మనసు గెలుచుకున్నారు. అయితే పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గానిర్వహిస్తున్న తీరును చూసి ఓర్వలేకపోతున్న జగన్ దళాలు.. అర్హులైన లబ్ధిదారులను తొలగించేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటుగా పెట్టుకుంది. అలాంటి విమర్శకుల నోర్లకు తాళాలు వేసేలా ప్రభుత్వం ఇప్పుడు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు మంత్రి కొడపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని.. వీరందరికీ కూడా త్వరలోనే మంజూరుచేస్తామని ఆయన అంటున్నారు. పెన్షన్లను కోతపెడుతున్నదని.. తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఈ మాటలు గట్టి దెబ్బే అని చెప్పాలి.
పింఛన్లను నాలుగువేల రూపాయలకు పెంచనున్నట్టుగా.. జగన్ లాగా ఏడాదికి 250 లాగా కాకుండా, ఒకేసారి వెయ్యి పెంచడంతో పాటు.. ఏప్రిల్ నుంచి ఇవ్వనున్నట్టుగా చంద్రబాబు ఇచ్చిన హామీ అప్పట్లో ఓటర్ల మీద ఎంతో ప్రభావం చూపించింది అనే చెప్పాలి. అయితే.. జగన్ ఈ పింఛన్ల హామీతో కంగారు పడ్డారు. 2019 ఎన్నికల సమయంలో.. తొలుత తాను 2వేలు పెన్షను చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్.. చంద్రబాబు తన పాలనలోనే 2వేలు చేసేసిన తర్వాత.. ‘అయితే తాను మూడు వేలు చేస్తానంటూ’ ప్రకటించారు. 2024 ఎన్నికల సమయంలో.. చంద్రబాబు 4వేలు పెన్షను ప్రకటించిన తర్వాత.. ఆ సవాలును స్వీకరించే ధైర్యం చేయలేకపోయారు. పెన్షన్ల విషయంలో అసలు పెంపు హామీ ఇవ్వకపోగా.. చంద్రబాబు మాట నిలబెట్టుకునే నాయకుడు కాదు.. అనే నెగటివ్ ప్రచారం మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఆయనను నమ్మవద్దని జనాల్ని బతిమాలుకున్నారు. తెలివైన ఓటర్లు.. జగన్ తప్పుడు ప్రచారాలనే నమ్మలేదు. ఓడించి ఇంటికి పరిమితం చేశారు.
చంద్రబాబు సర్కారు తొలినెల నుంచి ప్రతినెలా ఒకటో తేదీన వాలొంటీర్లు అనే బూటకపు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సిబ్బంది ద్వారానే పెన్షన్లు అందజేస్తున్న తీరు కూడా జగన్ కు కంటగింపుగా మారింది. ఇప్పుడు పెన్షనర్ల జాబితాల్లో కోతలు అంటూ తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. తాజాగా 93వేల మంది మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్టుగా మంత్రి కొండపల్లి ప్రకటన జగన్ వర్గం ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది. మంత్రి చెబుతున్నట్టుగా.. మొత్తం 5 లక్షల మంది కొత్త లబ్ధిదార్లకు పెన్షన్లు ఇవ్వడం అంటూ జరిగితే.. ప్రజలు కూటమి ప్రభుత్వానికి నీరాజనం పడతారని అంతా అనుకుంటున్నారు.
తప్పుడు ప్రచారకుల నోర్లకు తాళాలు!
Wednesday, March 26, 2025
