లిక్కర్ స్కామ్ : ఎవరీ బాలాజీ? ఏమా కథ??

Monday, December 8, 2025

లిక్కర్ స్కామ్ గురించి.. సుమారు కొన్ని నెలలుగా బీభత్సమైన చర్చ జరుగుతోంది. రాజకీయవర్గాల్లో దీని గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తమ తొలి నివేదికలను విడుదల చేసిన తర్వాత.. మూడువేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని లెక్కలు తేల్చిన తరువాత.. కుంభకోణంలో భాగమైన అనేకమంది పేర్లు బయటకు వచ్చాయి. రాజ్ కెసిరెడ్డి అందరికీ కలిపి కేంద్రబిందువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. తాజాగా కెసిరెడ్డి పోలీసులకు చిక్కిన తర్వాత.. ఒక విడత ఆయనను కూడా విచారించిన తరువాత.. హఠాత్తుగా బాలాజీ అనే పేరు తెరమీదకు వచ్చింది. వసూళ్ల మొత్తాన్ని తాను జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు, బాలాజీకి అందజేసేవాడినని రాజ్ కెసిరెడ్డి చెప్పడంతో అప్పటిదాకా ఆ పేరు ఈకేసులో వినని వారంతా నిర్ఘాంత పోయారు. మరి అంత కీలకంగా మారిన ఈ బాలాజీ ఎవరు? ఆర్థిక వ్యవహారాల్లో ముడుపుల సొమ్మును నేరుగా తన చేతికి తీసుకోగల స్థాయి ఆయనకు ఎలా వచ్చింది? అనే సందేహాలు కలగడం సహజం.
ఈ బాలాజీ అనే వ్యక్తి పూర్తి పేరు గోవిందప్ప బాలాజీ. ఆయనది చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఒక పల్లె. వైఎస్  భారతికి చెందిన భారతి సిమెంట్స్ లో ఆయన 2010 నుంచి పూర్తికాలపు డైరెరక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాలు అన్నీ ఆయనే చూస్తుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఎంతగా నమ్మిన బంటుగా ఉండేవారో.. జగన్ భార్య వైఎస్ భారతికి గోవిందప్ప బాలాజీ కూడా అంతే నమ్మిన బంటు. ప్రతినెలా తన నెట్ వర్క్ ద్వారా వసూళ్లు చేసే 50-60 కోట్ల రూపాయలను ఈ ఇద్దరిచేతులకు అందిస్తూ వచ్చినట్టు రాజ్ కెసిరెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారు.

మద్యం కుంభకోణం గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రతి దశలోనే చెలామణీలోకి వచ్చిన పేర్లు అనేకం ఉన్నాయి. రాజ్ కెసిరెడ్డి ప్రధానం కాగా, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సయిజు అధికారి సత్యప్రసాద్, ఇంకా ఓఎస్డీ కఋష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ ధనంజయరెడ్డి మాత్రమే కాకుండా.. రాజ్ కెసిరెడ్డి బంధుమిత్రగణాల పేర్లు వినిపించాయి. గోవిందప్ప బాలాజీ పేరు ఇప్పటిదాకా బయటకు రాలేదు.

వైఎస్ జగన్- వైఎస్ భారతి దంపతులు ఇద్దరికీ అత్యంత విశ్వసనీయులు అయిన ఇద్దరు అనుచరులకు లిక్కర్ కుంభకోణం నుంచి ప్రతినెలా 50-60 కోట్ల రూపాయల ముడుపులు చేతికి అందుతూ ఉండేవంటే.. ఇక అంతిమ లబ్ధిదారులు ఎవరు? అనే విషయంలో సందేహాలు మిగిలి ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles