3500 కోట్లరూపాయల లిక్కర్ స్కామ్ త్వరలోనే ఒక కొలిక్కి రానుందా? కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన తోడల్లుడు, స్నేహితుల ఆసరాతో నడిపించిన నెట్వర్క్ ద్వారా.. ప్రతి నెలా డిస్టిలరీలనుంచి వసూలు చేసిన 50-60 కోట్ల రూపాయలను అంతిమ లబ్ధిదారు తరఫున పుచ్చుకుని.. దాని రూపు మార్చడంలో కీలక భూమిక పోషించి.. విశ్వసనీయులు అందరూ ఇప్పుడు కటకటాల పాలు కానున్నారా? వారందరి కస్టోడియల్ విచారణతో మొత్తం లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న రహస్యాలన్నీ వెలుగులోకి వస్తాయా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. కీలకమైన ముగ్గురిలో గోవిందప్ప బాలాజీ ఇప్పటికే రిమాండులో ఉండగా.. మిగిలిన ఇద్దరు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సీఎంఓ కార్యదర్శి ధనంజయ్ రెడ్డి ల అరెస్టు శుక్రవారం సాయంత్రంలోగా జరగవచ్చునని ప్రజలు అంచనా వేస్తున్నారు.
ఈ ఇద్దరు అధికారులు ముందస్తు బెయిలుకోసం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. ఈ ముగ్గురి పేర్లను సిట్ పోలీసులు లిక్కర్ స్కామ్ లో నిందితులుగా చేర్చినప్పటినుంచి వారు పరారీలోనే ఉన్నారు. పరారీలో ఉంటూనే ముందస్తు బెయిలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసి.. అక్కడ విచారణ సాగుతుండగానే సుప్రీంలో కూడా పిటిషన్ వేశారు. హైకోర్టులో తేలిన తర్వాత రావాల్సిందిగా సుప్రీం చెప్పింది. హైకోర్టు వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. తర్వాత మళ్లీ ఫ్రెష్ గా సుప్రీంలో ముందస్తు బెయిలు పిటిషన్ వేశారు. ఈ ఇద్దరికి మాత్రం 16వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీం న్యాయస్థానం ఇవాళ ఆ పిటిషన్ ను విచారించింది.
ఈలోగా గోవిందప్ప బాలాజీని కర్నాటక లోని ఒక వెల్ నెస్ సెంటర్ లో సిట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. అరెస్టు నుంచి రక్షణ తోపాటు, విచారణకు హాజరు కావాల్సిందే అని సుప్రీం హుకుం జారీచేసింది గనుక.. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి ఇద్దరూ సిట్ ఎదుట హాజరయ్యారు. బుధ, గురువారాల్లో దాదాపు 18 గంటల పాటు వారి విచారణ సాగింది గానీ.. పోలీసులు వారినుంచి రాబట్టిన వివరాలు మాత్రం శూన్యం. ఏం అడిగినా తెలియదు.. సంబంధంలేదు వంటి జవాబులే వల్లించారు. శుక్రవారం కూడా వారిని విచారణకు పిలిచిన సిట్ పోలీసులు సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందో అని నిరీక్షిస్తున్నట్టు సమాచారం.
తాజాగా సుప్రీం వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టేయడంతో సిట్ కు అడ్డంకులు తొలగినట్లయింది. ఇవాళ్టి విచారణలో ఆ ఇద్దరూ నిజాలు వెల్లడిస్తే సరేసరి.. లేకపోతే.. సాయంత్రం విచారణ ముగిసే సమయానికి ఆ ఇద్దరినీ కూడా అరెస్టు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ : సాయంత్రంలోగా ఆ ఇద్దరి అరెస్టు!
Monday, December 8, 2025
