యావత్ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణంగా ప్రకంపనలు సృష్టిస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతంలో.. తాజా చేర్పుల నేపథ్యంలో నిందితుల జాబితా 39కి చేరింది. జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన కొడుకు మరియు వారి అనుచరులు నలుగురి పాత్రను లిక్కర్ కుంభకోణంలో నిర్ధరించిన తర్వాత.. సిట్ పోలీసులు ఆ పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. వీరిలో డబ్బు వసూళ్లు సరఫరాలో కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్ నాయుడు, ఈ ముఠాకు సూత్రధారి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇద్దరూ కొలంబో పారిపోతుండగా బెంగుళూరులో సిట్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కామ్ లో జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర రెడ్డి పాత్ర.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన మాత్రం పోలీసుల దర్యాప్తు తీరునే దబాయిస్తూ వచ్చారు. ఆయన గన్ మెన్ లను, డ్రైవర్ లను విచారించిన సిట్ పోలీసులు చెవిరెడ్డి పాత్రకు సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అలాగే.. వెంకటేశ్ నాయుడు వంటి వారి పాత్ర కీలకం కావడంతో వారిని విచారించేందుకు పిలిచినా వారు సహకరించలేదు. పోలీసులు కావాలనే తనను ఇరికించాలని చూస్తున్నారంటూ భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఎదురుదాడికి దిగడం మాత్రం చాలా సహజంగా జరుగుతూ వచ్చింది. ఈ పరిణామాల నడుమ.. మొత్తానికి చెవిరెడ్డి తండ్రీకొడుకులు సహా ఆరుగురిని నిందితులుగా చేర్చి సిట్ పోలీసులు ఉచ్చు బిగించారు. వీరిలో ఇద్దరు అరెస్టు కాగా మిగిలిన వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.
లిక్కర్ కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి ప్రధాన సూత్రధారి అని.. వసూళ్ల పర్వం మొత్తం నడిపించిన అసలు వ్యక్తి అని అందరికీ తెలుసు. మద్యం కంపెనీల నుంచి ఆయన పోగేసిన వేల కోట్ల రూపాయలను విడతలు విడతలుగా స్వీకరించి.. వాటిని ఏపీలోని వివిధ అవసరాలకు తరలించిన పాత్రను చాలా మందే పోషించారు. అందులో చెవిరెడ్డి ముఠా కూడా తన వంతు పాత్ర పోషించింది. హైదరాబాదులో రాజ్ కెసిరెడ్డి నుంచి నగదు తీసుకుని.. అక్రమ మార్గాలలో ఏపీకి, ఎన్నికల అవసరాలు సహా ఇతర పనులకు తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. చెవిరెడ్డి పీఏ స్వయంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదును ఓ పైపుల లారీలో రహస్యంగా అమర్చిన అరలలో తరలిస్తుండగా.. ఎన్నికల సమయంలో పోలీసులు పట్టుకున్నారు కూడా. అది కూడా లిక్కర్ సొమ్మే అని తాజాగా సిట్ తేల్చింది.
రాజ్ కెసిరెడ్డి నుంచి వెంకటేశ్ నాయుడుకు తొలుత సొమ్ము అందగా.. ఆయన వివిధ చిన్న మొత్తాల్లో అనాజ్ పూర్ వద్దకు చేర్చి అంతా కలిపి లారీలో లోడ్ చేసి పంపినట్టుగా గుర్తించారు. ఈ తరలింపు పాత్రల్లో చెవిరెడ్డి అనుచరులు కీలకంగా వ్యవహరించగా తండ్రీ కొడుకులు వారికి మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చెవిరెడ్డి అరెస్టుతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగినట్టు లెక్క. ఇది ఈ కేసులో తొలి రాజకీయ అరెస్టుగా తేలుతోంది. ఇప్పటిదాకా సలహాదారులుగా చేసిన వారు, వారి అనుచరులు, అధికారులు లాంటి వాళ్లు మాత్రమే అరెస్టు అయ్యారు. రాజకీయ నేతల్ని పిలిచి విచారించి పంపడం మాత్రమే జరిగింది. చెవిరెడ్డి పరారీకి యత్నించినందువల్ల తొలి రాజకీయ అరెస్టుగా ఈ కేసులో గుర్తింపు పొందారు.
లిక్కర్ నిందితులు @39 : చెవిరెడ్డి వాటా ఆరుగురు!
Friday, December 5, 2025
