అమరావతిని మాత్రమే రాజధానిగా గుర్తించాలని అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు అన్నింటినీ పునరుద్ధరించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల కాన్సెప్టుతో సుప్రీం తలుపు తట్టింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. అమరావతి రాజధానిని మాత్రమే కోరుకునే పార్టీలే ఎన్డీయే కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీం ఎదుట ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ త్వరగా ముగించాలని.. అమరావతి ఒక్కటి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హైకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఉంటాం అని పేర్కొంటూ ప్రభుత్వం సుప్రీంలో ఏకంగా 16 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంలో ఉన్న న్యాయపరమైన పెండింగు ఆటంకాన్ని తొలగించినట్లయింది.
జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డ్రామా ప్రారంభించిన తర్వాత.. అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే సుదీర్ఘమైన పోరాటం సాగించారు. జగన్ ప్రభుత్వం మధ్యలోనే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేసేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు చేసింది. రైతుల సుదీర్ఘ పోరాటం ఫలితంగా.. హైకోర్టులో అమరావతికి అనుకూల తీర్పు వెలువడింది. అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని, విశాఖకు తరలించడానికి వీల్లేదని, అమరావతిలో ఆగిన నిర్మాణాలన్నీ వెంటనే తిరిగి ప్రారంభించాలని హైకోర్టు చెప్పింది. అయితే కోర్టుల మాటలు బేఖాతరు చేసే, సవాలు చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
తాజాగా ఆ పిటిషన్ విచారణకు రాబోతున్న సమయంలో.. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఇక ఆ పిటిషన్ ముగించేయాలని కోరుతూ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. రైతులకు చట్టపరంగా నెకవేర్చాల్సిన హామీని అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.. అంటూ ప్రభుత్వం అందులో పేర్కొంది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్‌బుల్ ప్లాట్లను అన్ని మౌలికవసతుల సహా.. మూడేళ్ల లోగా అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించింది. అయితే.. ఈ అఫిడవిట్ వలన సుప్రీంలో పెండింగులో ఉన్న పిటిషన్ కూడా.. తొలగిపోనుండడం అనేది అమరావతి ప్రియులకు ఒక అద్భుతమైన వార్త అని అంతా అనుకుంటున్నారు.