ఆయనేమో కరడుగట్టిన వామపక్ష భావజాలంతో ఉండే సీనియర్ నాయకుడు. మరొక వైపు చంద్రబాబునాయుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీకి సారథి. మోడీ జట్టులో ఉన్నందుకు, మామూలుగా అయితే, లెఫ్ట్ నేత చంద్రబాబు మీద నిప్పులు కురిపిస్తూ ఉండాలి! కానీ, ఆయన మాత్రం చంద్రబాబు దార్శనికతను వేనోళ్ల కొనియాడుతున్నారు. చంద్రబాబు విజన్ ను సరిగ్గా అర్థం చేసుకుంటే.. రాజకీయ ప్రత్యర్థులు అయినా సరే అంగీకరించి తీరవలసిందే అనేందుకు ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది.
తెలంగాణలో సీపీఐ సీనియర్ నాయకుడు కూనంనేని సాంబశివరావు ప్రస్తుతం అధికారకూటమిలో భాగంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తెలంగాణ శాసనసభలో మాట్లాడుతూ టూరిజం విషయంలో చంద్రబాబు దార్శనికతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఏ ఇజం లేదు.. ఇక టూరిజమే ప్రధానం అనేవారు.. ఏ ఇజం లేదు అని అన్నప్పుడు మాకు కోపం వచ్చేది. కానీ నిజానికి ఖర్చులేని ఇజం ఏదైనా ఉన్నదా అంటే అది టూరిజమే’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలను కోట్ చేసి మరీ.. తెలంగాణలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం గురించి ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
సీపీఐ నేత తన మాటలను ప్రస్తావించి.. టూరిజం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంపై చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నడో తాను టూరిజం గురించిన చెప్పిన మాటలను ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారని అన్నారు. తన ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడానికి వారికి ముప్పయ్యేళ్లు పడుతోందని చంద్రబాబు అనడం విశేషం.
ఒకప్పట్లో చంద్రబాబునాయుడు విజన్ 2020 అంటూ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించి.. పరిపాలన సాగించారు. విజన్ 2020 అనే ముందుచూపు గురించి హేళన చేసిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఆయన దార్శనికత ఫలితంగా ఇప్పుడు హైదరాబాదులో ఐటీ రంగం ఏ స్థాయిలో వర్ధిల్లుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడు విజన్ 2047 అనే దార్శనికతతో ముందుకు సాగుతున్నారు.
అమరావతి నిర్మాణంలో ఆయన ముందుచూపు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అవుటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతులు, నిధులు సాధిస్తూనే.. అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి రైల్వే లైను కూడా ప్లాన్ చేయడం లాంటిది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే అన్ని రకాలుగానూ.. చంద్రబాబు విజన్ ప్రస్తుత కాలానికంటె ముందుంటుందని అందరూ ఒప్పుకుంటూ ఉంటారు. ఒకప్పటి చంద్రబాబు గురించి.. ఇప్పుడు లెఫ్ట్ నేత పొగుడుతున్నారు. ఆయన ఇప్పటి విధానాల గురించి ఎప్పటికైనా సరే.. అందరూ కీర్తించాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.
చంద్రబాబు దార్శనికతకు లెఫ్ట్ నేత కితాబులు!
Sunday, March 30, 2025
