25 ఏళ్లపాటూ విద్యుత్తు సరఫరాకు కుదిరిన ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేసేస్తే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సడలిపోతుందని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ రకంగా ఒకవేళ ఒప్పందాలు రద్దు చేస్తే గనుక.. కుదుర్చుకున్న సంస్థలు కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉంటుందని ఆలోచిస్తున్నది. అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత భారీ ముడుపులు చేతులు మారిన ఈ ఒప్పందాలను రద్దు చేసి తీరాల్సిందేనని, తద్వారా రాష్ట్ర ప్రజల మీద పడే భారాన్ని తప్పించాల్సిన అవసరం ఉన్నదని వామపక్షాలు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవైపు అమెరికా పర్యటనలో ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అదానీ ముడుపుల వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని కోరుతున్నారు. అమెరికాలోనే అభియోగాలు నమోదైన నేపథ్యంలో అదానీని కాపాడడానికి ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకోకుండా ఉండాలని కూడా నారాయణ అంటున్నారు. ఆ ఒప్పందాలను రద్దు చేస్తే తప్ప రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూడలేమని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. తనతో సంబంధం లేకుండానే.. కేబినెట్ తీర్మానం ద్వారా.. సెకితో ఒప్పందాలను ఆమోదింపజేసుకున్నట్టుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పిన నేపథ్యంల ఈ ఒప్పందాల వెనుక పెద్ద బాగోతమే ఉన్నట్టుగా రామకృష్ణ అభివర్ణిస్తున్నారు. అప్పట్లో ముడుపులు తీసుకున్న నాయకులు, ఆ ఒప్పందం కుదరడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు అందరి మీద కూడా దర్యాప్తు జరగాలని సీపీఐ కోరుకుంటున్నది.
ఈ ఒప్పందాల రద్దు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించాలని కూడా సీపీఐ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇలా పాత ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలను కొత్త ప్రభుత్వాలు ఉన్నపళంగా రద్దు చేసేయడం జరుగుతూ ఉంటే ఇన్వెస్టర్లు ముందుకు రావడానికి జంకుతారనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించబోతున్నట్టుగా చంద్రబాబునాయుడు ఇటీవల మీడియా మీట్ లో సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు వామపక్షాల ఒత్తిడితో ఒప్పందాల రద్దు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
ఒప్పందాల రద్దుకు వామపక్షాల పట్టు!
Thursday, December 26, 2024