వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వద్ద సొంత అయిడియాలంటూ ఏమీ ఉండవా? వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకుడి కొడుకు, సుదీర్ఘకాలంగా పార్టీ నడుపుతున్నారు.. అయిదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి నాయకుడు.. కనీసం అయిడియాలు, అనుసరించే విధానాల్లోనైనా సొంత ముద్ర ఉండాలని కోరుకోరా? కాపీ అయిడియాలతోనే తాను కొత్త పంచ్ లు వేస్తున్నట్టుగా బిల్డప్ లు ఇస్తారా? కొత్త అయిడియాల విషయంలో ఆయన కంటె పార్టీలోని ఇతర నాయకులే బెటరా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి మాటలను గమనిస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది.
నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నారాలోకేష్ రెడ్ బుక్ గురించి నానా మాటలు అంటూ వచ్చారు. రెడ్ బుక్ అంటూ లోకేష్ అందరినీ బెదిరిస్తున్నారని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ అసలు తెరవనే లేదని లోకేష్ అన్నతరువాత, తన మాటలకు ప్రజల్లో విలువ లేదని గ్రహించిన జగన్.. ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారు.
రెడ్ బుక్ అనేది పెద్ద పనా? దాన్ని తయారుచేయడం పెద్ద విషయమా? అంటున్నారు. నియోజకవర్గాల్లోని తమ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఒక రెడ్ బుక్ తయారుచేయాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. తప్పులు చేసే వారందరి పేర్లను అందులో రాసుకుంటూ పోవాలట. మా కార్యకర్తలే బోలెడు రెడ్ బుక్ లు చేస్తారు అని జగన్ మురిసిపోతూ చెబుతున్నారు. దానికి తోడు.. గుడ్ బుక్ అనే మరో మాటను కూడా జగన్ కనిపెట్టారు. పార్టీ కోసం మంచి పనులు చేసే వారందరి పేర్లను ఆ గుడ్ బుక్ లో రాసుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సేవలను గుర్తిస్తామని ఆయన అంటున్నారు.
జగన్ ఇలా రెడ్ బుక్ లు, గుడ్ బుక్ గురించి చెప్పడాన్ని గమనించిన కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులకు ఎవరికైనా థ్రిల్లింగ్ గా అనిపిస్తే, తమ నాయకుడు గొప్ప పనిచేస్తున్నాడని అనిపిస్తే వారు పప్పులో కాలేసినట్టే. వారు కొద్ది రోజులుగా అసలు న్యూస్ ఫాలో కావడం లేదన్నమాట. ఈ రెండు మాటలు కూడా జగన్ కాపీ కొట్టినవే. ఆయన సొంత ఆలోచనలు కాదు. కొన్ని రోజుల కిందట గుంటూరు జిల్లా పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం సమయంలో సజ్జల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రెడ్ బుక్ తయారుచేయాలని పిలుపు ఇచ్చారు. అలాగే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు.. తాను ఒక గ్రీన్ బుక్ తయారుచేస్తున్నానని.. పార్టీకోసం కష్టపడ్డ వారి పేర్లు అందులోరాసి.. వారికి మంచి అవకాశాలు కల్పిస్తానని అన్నారు.
జగన్ ఆ ఇద్దరి నుంచి ఈ పదాలను కాపీ కొట్టారు. గ్రీన్ బుక్ ను, గుడ్ బుక్ గా మార్చారు. సజ్జల నుంచి కాపీకొట్టిన ‘కార్యకర్తల రెడ్ బుక్ లు’ను యథాతథంగా వాడుకున్నారు. అక్కడికేదో తాను పంచ్ డైలాగుల ప్రసంగం తయారుచేసుకుంటున్నట్టుగా ఈ కాపీ మాటలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. పార్టీని కాపాడుకోవడం కోసమైనా జగన్ కొత్త ఆలోచన చేయకపోతే ఎలా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
సొంతవి లేవ్.. కాపీ అయిడియాలతో జగన్ ఎచ్చులు!
Wednesday, January 22, 2025