ఏపీ కాంగ్రెస్ లో ఇంకా చక్రం తిప్పుతున్న కెవిపి

Thursday, November 14, 2024

. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవం వలే మిగిలిపోయింది. ఢిల్లీ పెద్దలకు ఇష్టులైన వారికి నాయకత్వం అప్పచెబుతూ ఉండడం, వారేమో అధికార పక్షంతోనో, ప్రధాన ప్రతిపక్షం తోనో `లాలూచి’ రాజకీయాలు చేస్తూ కాలం గడపడం చేస్తూ వస్తున్నారు. 

అంతేగాని, ప్రజలలోకి వెళ్లగల నాయకులు ఎవ్వరిని ప్రోత్సహించడం లేదు. 22 ఏళ్ళ తర్వాత `గాంధీ కుటుంబం’ నుండి కాకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే మొదటగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రక్షాళనకు పూనుకోవడం సంతోషమే. అయితే పాత వరవడిలోనే ఢిల్లీ పెద్దలకు సన్నిహితులైన వారు చెప్పిన పేర్లతో చాంతాడంతా జాబితా విడుదల చేశారు. 

ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీ పెద్దలతో పరిచయాలకు పరిమితం అవుతూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి `ఆత్మా’గా పేరొందిన డా. కెవిపి రామచంద్రరావు తిరిగి కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నట్లు ఈ జాబితా చూసినవారికి అర్ధం అవుతుంది. ఆయనకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్పా ఏనాడూ సొంత పార్టీని పటిష్టం చేయడం పట్ల దృష్టి సారించిన దాఖలాలు లేవు. 

డా. కెవిపి ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేదు. తెరచాటు రాజకీయాలు తప్ప, ప్రజలను సమీకరించే శక్తి లేదు. అట్లాంటిది తన చుట్టూ  తిరుగుతూ వస్తున్న గిడుగు రుద్రరాజును కొత్త పిసిసి అధ్యక్షునిగా నియమించారు. దానితో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి ప్రాణం పోసుకొనేటట్లు చేయడం పట్ల ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సహితం పెద్దగా ఆసక్తిగా లేరని స్పష్టమైంది. 

కెవిపి వందిమాగధులతో పిసిసి జాబితా నిండిపోయింది.  కొద్దికాలం క్రితం తిరిగి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారికి ఏమాత్రం ప్రాబల్యం లేకుండా చేసే  ప్రయత్నంగా కూడా కనిపించింది. కనీసం కాంగ్రెస్ లో మిగిలిన కొద్దిమందినైనా కలుపుకుపోగల నాయకత్వం ఆ పార్టీలో కొరవడినట్లు అర్ధం అవుతుంది. 

కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించడం తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది.  18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమిస్తూ  ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యంతో కేంద్ర మంత్రిగా కొనసాగడం తప్పా, స్థానికంగా పార్టీ గురించి పట్టించుకోని  పల్లంరాజును కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా నియమించారు. 

ఈ నియామకాల పట్ల మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మొదటగా బహిరంగంగా తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవిని వద్దంటూ అధిష్టానానికి తిరస్కరణ లేఖ పంపించారు. పైగా, కమిటీ కూర్పును ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. 

ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని.. వైఎస్సార్‌సీపీకి రెడ్డి సామాజికవర్గం.. టీడీపీకి కమ్మ, జనసేన పార్టీకి కాపు, బీజేపీకి కాపు, సీపీఎంకు రెడ్డి, సీపీఐకి బీసీలు అధ్యక్షులుగా ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి కూడా బ్రాహ్మణ వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా,  ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా  అగ్రవర్ణాల వారికి ఇస్తే కాంగ్రెస్ బలపడుతుందని హర్షకుమార్ అవహేళన చేశారు. మరి అనేకమంది సహితం ఇదే విధమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles