వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎన్డీఏ కూటమి సొంతం చేసుకోబోతోందా? జగన్మోహన్ రెడ్డికి మరో పరాభవం రుచి చూపించే రీతిలో ఆయన సొంత జిల్లాలో ప్రాభవానికి గండి కొడుతూ తెలుగుదేశం నాయకుడు కడప జడ్పీ చైర్మన్ కాబోతున్నారా? అలాంటి అవకాశాన్ని తోసి పారేయలేమని అంటున్నాయి రాజకీయ వర్గాలు! ప్రస్తుతం కడప జడ్పీ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక జరగవలసి ఉన్న నేపథ్యంలో.. గెలుపు అందించే మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో మాత్రమే తెలుగుదేశం ఉంది. ఇలాంటి తరుణంలో ఏమైనా జరగవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 50 స్థానాలు ఉన్న కడప జడ్పీలో ఒక సభ్యుడు మరణంతో కలుపుకుంటే.. ప్రస్తుతానికి 48 ఓట్లు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ సభ్యులు ఒకరు బీజేపీలోకి నలుగురు తెలుగుదేశం లోకి మారారు. స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఏకంగా 49 గెలిచిన వైసిపి బలం 42 కు తగ్గింది. జగన్మోహన్ రెడ్డి జడ్పిటిసి లతో సమావేశం నిర్వహిస్తే పదిమంది వరకు గైర్హాజరైనట్లు సమాచారం. వారందరూ తెలుగుదేశం లో చేరే అవకాశం ఉంది. ఇంకా పలువురు సభ్యులు కూడా తెలుగుదేశం సీనియర్లతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల శాసనసభలో ప్రమాణం చేసిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లి రెండు రోజులు మకాం వేసినప్పుడు.. పులివెందుల కౌన్సిలర్లు పలువురు ఆయనకు తమ నిరసన తెలియజేశారు. వారంతా తెలుగుదేశంలోకి మారదలుచుకుంటే అవినాష్ రెడ్డి దగ్గరుండి బుజ్జగించి పార్టీని వీడకుండా చూడవలసి వచ్చింది. ఇప్పుడు జడ్పిటిసి సభ్యులు నిర్మొగమాటంగా పార్టీ మారడానికి తయారవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జడ్పీపీఠంపై తెలుగుదేశం జెండా తప్పకుండా ఎగురుతుంది- అని పలువురు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకున్నామనే సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించక మునుపే.. సొంత జిల్లా కడప జడ్పీ స్థానాన్ని జగన్ కోల్పోవాల్సి వస్తుందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కడప జడ్పీపీఠంపై కూటమి జెండా తథ్యం!
Sunday, December 22, 2024