‘‘అధికార వికేంద్రీకరణ.. మూడు రాజధానులు.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి’’ ఇవన్నీ కూడా మాయమాటలు. ప్రత్యేకించి రాయలసీమకు న్యాయరాజధాని ఇస్తున్నాం.. అభివృద్ధి చెందుతుంది.. అని జగన్ ప్రకటించడం పెద్ద మోసం. ఆ సంగతి తమకు తెలిసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అక్కడి ప్రజలు జగన్ నిర్ణయానికి జై కొడుతూ చెలరేగుతున్నారు. తాజాగా కూడా మూడురాజధానులకు కూడా అనుకూల సభలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు అనేది అభివృద్ధి సూచికగా, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటరీ రాజధానులకు సమానంగా బిల్డప్ ఇవ్వడం పెద్ద వంచన. ఎలాగో చూద్దాం..
ఆ మధ్య ఉత్తరాంధ్రకు చెందిన మేధావి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. విశాఖ రాజధాని కోసం తాను మంత్రిపదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సెలవిచ్చారు. తొలివిడతలో జగన్, తనకు కాకుండా తమ్ముడికి మంత్రిపదవి ఇచ్చినందుకు అలిగి, తమ్ముడిని తొలగించి తనకు ఇచ్చేదాకా అంటీముట్టనట్టు వ్యవహరించిన ఈ పెద్దమనిషి.. పదవి దక్కిన తర్రవాత.. త్యాగరాజు డైలాగులు వేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. విశాఖ రాజధానికి మద్దతు కూడగట్టే సభల్లో ఆయన ఒక అద్భుతమైన వాక్యం సెలవిచ్చారు.
‘‘అందరూ మూడు రాజధానులు అంటున్నారు గానీ.. నిజానికి విశాఖ ఒక్కటే రాజధాని. సీఎం, మంత్రులు, సెక్రటేరియేట్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు ఉంటే అమరావతికి వెళ్లి వస్తాం.. కర్నూలులో హైకోర్టు ఉంటే.. నేరగాళ్లు కేసులున్నవాళ్లు మాత్రం అక్కడకు వెళ్తారు.. అంతే’’ అంటూ మర్మం బోధించారు.
సీమ పోరాటయోధులకు, రాయలసీమ సంక్షేమాన్ని కాంక్షించే వారికి ఈ మంత్రిగారి మాటలు వినిపించాయో, లేక, వినపడనట్టుగా నటిస్తున్నారో మనకు తెలియదు. ‘న్యాయరాజధాని’ అనే పదం ఒక బూటకం! కర్నూలుకు హైకోర్టు అనేది కొంతవరకు న్యాయం చేస్తుంది. కానీ జగన్ చెబుతున్నది కర్నూలులో చీఫ్ జస్టిస్ తో కూడిన బెంచ్ మాత్రమే. అంటే అమరావతిలో హైకోర్టు బెంచ్ అలాగే కొనసాగుతుంది. ఒకే రాష్ట్రంలో రెండు హైకోర్టులు ఉంటాయి. సాధారణంగా గుంటూరు నుంచి రాజధానివైపు ఉండే అటు కేసులన్నీ గుంటూరుకే వెళ్తాయి. రాయలసీమ జిల్లాల కేసులు మాత్రం కర్నూలులో ఉండే హైకోర్టుకు వస్తాయి. ఇది అభివృద్ధిని ఇస్తుందా? శాసనరాజధాని, కార్యనిర్వాహక రాజధాని అనే పదాలతో సమానంగా న్యాయరాజధాని అనే ముసుగులో ఈ ‘హైకోర్టు బెంచ్’ వలన ప్రగతి సాధ్యమవుతుందా? మూడురాజధానులను సమర్థిస్తున్న సీమయోధులు ఈ వాస్తవాన్ని గ్రహించడంలేదా.. తమ రాజకీయ ప్రయోజనాలకోసం జగన్ ప్రాపకం కోసం ఆ పనిచేస్తున్నారా? అనేది తెలియదు.
నిజంగా వారికి సీమ మీద శ్రద్ధ ఉంటే.. ఇతరత్రా అభివృద్ధి పనుల గురించి అడగాలి. అంతే తప్ప.. న్యాయరాజధాని అనే పేరుతో ఒక భవనంలో హైకోర్టు బెంచ్ వస్తే.. దానివలన సీమ నాలుగు జిల్లాలు ప్రగతి దిశగా పరుగులు పెడతాయని ఆత్మవంచన చేసుకుంటే.. ముందు ముందు వాళ్లే విలపించే రోజులు వస్తాయి.