సీఎంను కెలకడంతో బయటపడిన కేటీఆర్ పాత బేరాలు!

Friday, December 5, 2025

తెలంగాణలో ఒకవైపు ఇంటిపోరుతో దిక్కు తెలియకుండా సతమతం అవుతున్న కల్వకుంట్ల పెద్దలు, తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ ప్రసంగాలు అంటే.. ప్రాసలుపంచ్ లు మాత్రమే అని అనుకుంటూ వంకర టింకర మాటల పంచ్ లతో రెచ్చిపోతూ ఉండే భారాస నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. సందర్భం ఉన్నా లేకనపోయినా.. రేవంత్ రెడ్డిని కార్నర్ చేసేలా అనేక విమర్శలు చేస్తూ గడుపుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిని తాను చాలా తెలివిగా ఇరుకున పెడుతున్నానని కేటీఆర్ భావించారో ఏమో గానీ.. మొత్తానికి అర్థంపర్థం లేని విమర్శలు చేసి.. పెద్ద పొరబాటు చేశారు. రేవంత్ రెడ్డికి- సీఎం రమేష్ కు ముడిపెట్టి విమర్శలు చేయడం వల్ల.. గతంలో దొంగచాటుగా కేటీఆర్ భాజపా నాయకులతో సాగించిన బేరసారాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంతకూ ఏం జరిగిందంటే.. రేవంత్ రెడ్డిని ప్రతిరోజూ దూషించి, తూలనాడి పబ్బం గడుపుకునే క్రతువులో భాగంగా.. కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా కనిపెట్టినట్టుగా ఒక సంగతి బయటపెట్టారు. రేవంత్ రెడ్డి, ఏపీలోని అనకాపల్లి ఎంపీ బిజెపి నాయకుడు సీఎం రమేష్ కు 1650 కోట్ల రూపాయల కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టారని విమర్శలు చేశారు. దీంతో సీఎం రమేష్ కు మండింది. అనకాపల్లిలోనే ప్రెస్ మీట్ పెట్టి.. కేటీఆర్ మీద  ఒక రేంజిలో విమర్శలు కురిపించారు.

బీఆర్ఎస్ పరిపాలన సాగుతున్న రోజుల్లో కూడా తమ రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ రెండువేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసిందని.. అవి కూడా నామినేషన్ పద్ధతిపై ఇచ్చారా? అని నిలదీశారు. అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపటి ఉన్నట్టుగానే.. తెలంగాణలో కేటీఆర్ కు కూడా ఇంట్లో కుంపటి ఉన్నదని.. ఆ గొడవలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

గతంలో కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేసి ఢిల్లీ తీహార్ జైల్లో పెట్టినప్పుడు.. కేటీఆర్ ఢిల్లీలోని తన నివాసానికి వచ్చి.. తమ మీద ఉన్న కేసులు ఎత్తివేయించాల్సిందిగా బేరాలాడినట్టుగా కూడా సీఎం రమేష్ వెల్లడించారు. కేసులను ఎత్తేయించి.. జైలునుంచి విడుదల అయ్యేలా చూస్తే.. భారాసను, భాజపాలో విలీనం చేసేందుకు కేటీఆర్ ప్రతిపాదన పెట్టారని కూడా సీఎం రమేష్ వెల్లడించారు. కేటీఆర్ ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేశారో గానీ.. వాటి ప్రభావానికి, ఆయన గతంలో బిజెపి పెద్దలతో సాగించిన దొంగచాటు బేరసారాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అనవసరంగా సీఎం రమేష్ ను కెలకడం వల్ల.. కేటీఆర్ జనం దృష్టిలో పలుచన అయిపోతున్నారని గులాబీ కార్యకర్తలే అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles